Prithvi Shaw: పృథ్వీషాకే మద్దతు ఎక్కువ - ఆశీష్ నెహ్రా
Prithvi Shaw: ప్రంపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కోసం టీం ఇండియాను సెలక్ట్ చేసింది బీసీసీఐ.
Prithvi Shaw: ప్రంపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కోసం టీం ఇండియాను సెలక్ట్ చేసింది బీసీసీఐ. అయితే ఫాంలో ఉన్నా.. పృథ్వీషా మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో పృథ్వీషాను ఆడించాలని, అతనికి మరిన్ని ఛాన్సులు ఇవ్వాలనే మద్దతు పెరుగుతోంది. తాజాగా టీం ఇండియా మాజీ పేసర్ ఆశీష్ నెహ్రా తన గళాన్ని వినిపించాడు.
గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో పృథ్వీషాకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సిందని ఆయన అభిప్రాయపడ్డాడు. కొన్నసార్లు అక్కడి పరిస్థితులకు అలవాటు పడకపోవడంతో ఆటగాళ్లు ఫామ్‌ను కోల్పోతుంటారని, టీ20ల్లో రహానె కన్నా ఎక్కువ పరుగులు చేసే వారికే జట్టులో చోటివ్వాలని డిమాండ్ చేశాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పృథ్వీషా దిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. అలాగే ఆ టీంకి సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ తో కలిసి అద్భుత ఆరంభాలు ఇస్తున్నాడు. మ్యాచ్ విజయాల్లో పృథ్వీషా కీలక పాత్రను పోషిస్తున్నాడు. 8 మ్యాచుల్లో 38.50 సగటు, 166 స్ట్రైక్‌రేట్‌తో 308 పరుగులు చేశాడు. 3 హాఫ్ సెంచరీలు చేసి, మంచి ఫాంలో ఉన్నాడు. అలాగే అంతకుముందు విజయ్ హజారేలో సెంచరీల జోరు కొనసాగించాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో పృథ్వీషా విఫలమయ్యాడు. అయితే అతడి బ్యాటింగ్‌లో సాంకేతిక లోపమే ఇందుకు కారణమని ఆశీష్ నెహ్రా అన్నాడు. బంతి ఇన్‌స్వింగ్ అయినపుడు పృథ్వీషా విఫలమవుతున్నాడు. అలా బంతి లోపలికి దూసుకు వస్తున్నప్పుడు అతడి బ్యాటు, ప్యాడ్ల మధ్య ఎక్కువ దూరం ఉంటోంది. దీనివల్ల బంతి ఆ మధ్యలోంచి వెళ్లి వికెట్లను గిరాటేసేది. దీంతో ఎక్కువ సార్లు తన వికెట్ ను కోల్పోతున్నాడు.
అయితే తన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి పృథ్వీషా ఎంతగానో శ్రమించాడని నెహ్రా అన్నాడు. "అడిలైడ్ టెస్టు ఆడుతున్నప్పుడు పృథ్వీషాకు 30-40 టెస్టుల అనుభవం లేదు. కేవలం ఆ మ్యాచ్ ఆధారంగా సెలక్ట్ చేయక పోవడం సరికాదు. గతేడాది ఐపీఎల్‌లోనూ పృథ్వీషాను జట్టులోంచి తప్పించాల్సింది కాదు. ఏదేమైనా రహానె కన్నా ఎక్కువ రన్స్ చేసే యువకుడికే నా మద్దతు. అజింక్య మంచి ఆటగాడు కాదని అనడం లేదు. టీ20ల్లో షా, పంత్, స్టాయినిస్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు చాలా అవసరమని' నెహ్రా పేర్కొన్నాడు.