82వ గ్రాండ్ మాస్టర్‌గా చెస్ క్రీడాకారుడు ప్రణీత్
* జీఎం ఘనతను దక్కించుకున్న 15 ఏళ్ల ప్రణీత్
Uppala Praneeth: తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పాల ప్రణీత్ భారత 82వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. గత నెలలో మూడో జీఎం నార్మ్‌ను అందుకున్న ప్రణీత్ తాజాగా 2500 ఎలో రేటింగ్ సాధించి జీఎం ఘనతను దక్కించుకున్నాడు. అజర్‌బైజాన్‌లోని బాకూలో జరిగిన టోర్నీ 8వ రౌండ్‌లో అమెరికాకు చెందిన హన్స్ మోక్ నీమన్ పై సాధించిన విజయంతో ప్రణీత్ 2500 ఎలో రేటింగ్‌ను చేరుకున్నాడు. ప్రణీత్ తెలంగాణ నుంచి ఆరో జీఎం కావడం విశేషం. ఈ టోర్నీలో తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి ప్రణీత్ ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో నిలవగా, తెలంగాణకే చెందిన రాజా రిత్విక్ 20వ, హర్ష భరత్‌కోటి 71వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
ఆరేళ్ల ప్రాయంలో సరదాగా చెస్ బోర్డుపై కదిపిన పావులు అతడి జీవన గమనాన్నే మార్చేశాయి. ఎత్తులు నేర్చుకోవడం ప్రారంభించిన ఏడాదిలోనే రాష్ట్ర టైటిల్‌ను పట్టేశాడు. పదేళ్లు వచ్చేసరికి అండర్–11 కేటగిరీలో వరల్డ్ చాంపియన్ మకుటాన్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు జీఎం హోదాతో కెరీర్‌లో మరో మెట్టు పైకెక్కిన 15 ఏళ్ల ప్రణీత్.. తన ముందున్న లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్ అని తెలిపాడు. మిర్యాలగూడలోనిఆలగడప కు చెందిన ప్రణీత్ చిన్నతనంలో తండ్రి తన మిత్రుడితో కలిసి చెస్ ఆడతుండడం చూసి, ఆ ఆటపట్ల ఆకర్షితుడయ్యాడు. తన ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు.