Champions Trophy 2025: పాకిస్థాన్‌లోనే ఛాంపియన్స్‌ ట్రోఫీ.. పట్టువీడని పీసీబీ.. ఏం జరగనుంది?

Update: 2024-11-19 14:16 GMT

PCB about Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 విషయంలో అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. ఇటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అసలు తగ్గడం లేదు. పాకిస్థాన్‌లో టోర్నీ నిర్వహిస్తే భారత జట్టును పంపేదే లేదని బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. హైబ్రిడ్ మోడల్‌లో అయితే తాము ఆడుతామని, భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ స్పష్టం చేసింది. మరోవైపు ఆతిథ్యం విషయంలో పాకిస్థాన్‌ మొండిపట్టు వీడటం లేదు. టోర్నీ ఎక్కడికీ తరలించేది లేదని, పాక్‌లోనే నిర్వహిస్తామని పీసీబీ పట్టుబట్టింది. పీసీబీ, బీసీసీఐలతో ఐసీసీ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 కోసం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆధునీకీకరణ పనులను పీసీబీ ఛైర్మన్ మొహసీన్‌ నఖ్వీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించడానికి తాము ఆసక్తి చూపడం లేదన్నారు. పాకిస్థాన్‌లో భారత్ పర్యటించకపోవడానికి గల కారణాలను వివరించాలని తాము ఐసీసీకి లేఖ రాశామని చెప్పారు. ఐసీసీ బీసీసీఐతో మాట్లాడుతుందని, ఆ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడం లేదు. ఇండో-పాక్ టీమ్స్ ఐసీసీ టోర్నీలో మాత్రమే తలపడుతున్నాయి.

పీసీబీ ఛైర్మన్ మొహసీన్‌ నఖ్వీ మాట్లాడుతూ.. 'ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రతి జట్టు పాకిస్థాన్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. పాకిస్తాన్‌కు జట్టును పంపడంపై భారత్‌కు ఏవైనా ఆందోళనలు, సమస్యలు ఉంటే.. మాతో మాట్లాడాలి. మేము వాటిని పరిష్కరిస్తాం. టోర్నీ కోసం పాకిస్తాన్‌కు భారత్ రాకపోవడానికి ఎటువంటి కారణం లేదని నేను భావిస్తున్నా. క్రీడలు, రాజకీయాలు రెండూ వేర్వేరు. వాటిని రాజకీయం చేయడం మాకు అస్సలు ఇష్టం లేదు. ఐసీసీ త్వరలోనే టోర్నీ షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తుంది. మేము అన్ని ప్రశ్నలకు లేఖ ద్వారా సమాధానం ఇచ్చాం. ఐసీసీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాం. టోర్నమెంట్ పాకిస్థాన్‌లో జరుగుతుంది. పాక్ గౌరవం మాకు అన్నింటికన్నా ముఖ్యం. అందరూ కాస్త ఓపిక పట్టండి. త్వరలోనే ఏం జరుగుతుందో చూస్తారు' అని చెప్పుకొచ్చారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యం హక్కులు పాకిస్తాన్ వద్ద ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ట్రోఫీ జరగనుంది. దాదాపు 8 సంవత్సరాల అనంతరం ఈ ట్రోఫీ జరగబోతుంది. చివరిసారిగా 2017లో ఇంగ్లండ్‌లో ట్రోఫీ జరిగింది. ఫైనల్లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని టీమిండియాపై విజయం సాధించిన పాకిస్థాన్‌ విజేతగా నిలిచింది.

Tags:    

Similar News