Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. షూటింగ్‌లో కాంస్యం సాధించిన మను బాకర్
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల సింగిల్స్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించింది.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల సింగిల్స్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించింది. 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన మను భాకర్. తొలి రెండు స్థానాల్లో సౌత్ కొరియా అథ్లీట్లు నిలిచారు. హరియాణాకు చెందిన మను భాకర్ 2002లో జన్మించారు. ఆమె 2018 ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌లో భారతదేశం తరఫున ఆడి రెండు బంగారు పతకాలు సాధించారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించారు. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. 2020లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డుతో మను భకర్‌ను సత్కరించింది.
2017 కేరళలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్ షిప్‌లో భాకర్ 9 బంగారు పతకాలు సాధించి జాతీయ రికార్డును బద్దలుకొట్టారు. 2017లో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కూడా భాకర్ రజత పతకం కైవసం చేసుకుంది. 2018 మెక్సికోలోని గ్వాదలహరా నగరం వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్ షూటింగ్ వరల్డ్ కప్ లోని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోని ఫైనల్స్‌లో రెండుసార్లు ఛాంపియన్ గా నిలచిన అలెజాండ్రా జావ్లాను భకర్ ఓడించింది. ఈ విజయంతో భాకర్ వరల్డ్ కప్‌లో అతి చిన్న వయసులోనే బంగారు పతకం సాధించిన భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది.