India vs England: "సాఫ్ట్ సిగ్నల్" పై బీసీసీఐ కీలక నిర్ణయం
India vs England: అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ పై చర్చ సాగుతుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
India vs England: నాలుగో టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్‌ను మలాన్ ఎలా పట్టాడో అందరికీ స్పష్టంగా కనిపించింది. బంతి గ్రౌండ్‌కు తాకిన విషయం టీవీల ముందు కూర్చున్న లక్షలాది మందికి, మైదానంలో ఉన్న ఆటగాళ్లకూ తెలుస్తోంది. కానీ అంపైర్‌కు మాత్రం అది నాటౌట్ అనిపించలేదు. అందుకే ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ సూర్యను అంపైర్ పెవిలియన్‌కు పంపించాడు. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అలా ఎలా ఇచ్చాడు అనేది సగటు అభిమానికి అర్థం కాలేదు. అందుకు కారణం 'సాఫ్ట్ సిగ్నల్'. ఇప్పుడు ఇదే 'సాఫ్ట్' నిర్ణయం క్రికెట్లో కొత్త చర్చకు దారి తీసింది.
ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో ఆటగాళ్లు అవుటా? నాటవుటా? అన్న విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడం, అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ పై చర్చ సాగుతుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 9 నుంచి జరగనున్న ఐపీఎల్ లో ఫీల్డ్ లో ఉండే అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ను పరిగణనలోకి తీసుకోరాదని పేర్కొంది. ఐపీఎల్ నిబంధనల్లోని అపెండిక్స్ డీ-క్లాస్ 2.2.2 ప్రకారం చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.కాగా, ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన టీ-20 సిరీస్ లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్ ని ఇంగ్లండ్ అటగాడు డేవిడ్ మలాన్ డైవ్ చేస్తూ పట్టుకోగా, ఆ బంతి నేలను తాకినట్టు స్పష్టంగా కనిపించింది.