Mumbai Indians beat Delhi Capitals : IPL 2020 సీజన్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఫైనల్‌లోకి దూసుకెళ్లింది ముంబై ఇండియన్స్. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాతో సీజన్‌ను ఆరంభించిన ముంబై ఇండియన్స్ టోర్నీ ఆద్యంతం టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో మరోసారి ఫైనల్ చేరింది. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ యంగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరోసారి ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడింది.
ముంబై ఆటగాళ్లు మెరిసారు మురిపించారు. అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్‌కు చేరుకున్నారు. అంతా ఊహించినట్లుగానే ముంబై ఇండియన్స్ అల్ రౌండర్ ప్రతిభతో ఢిల్లీని చిత్తు చిత్తుగా ఓడించారు. కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన ముంబై మరోసారి ఫైనల్ చేరింది.
ఒత్తిడికి తలొగ్గిన ఢిల్లీ ఓడిపోయింది. ముంబై బ్యాట్స్‌మెన్ బౌండరీలతో చెలరేగిన పిచ్‌పైనే ఢిల్లీ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. ఢిల్లీ బౌలర్లు విఫలమైన చోటే ముంబై బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ముంబై జట్టు ఢిల్లీని 57 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. టీ20 లీగ్ 13వ సీజన్‌లో తొలి ఫైనల్‌కు దూసుకెళ్లిన తొలి జట్టుగా నిలిచింది.
201 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఓటమి దాదాపు ఖరారైంది. పరుగుల ఖాతా తెరవకుండానే ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో పడింది. పృథ్వీషా, అజింక్య రహానె, శిఖర్ ధావన్ ముగ్గురు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. మూడు ఫోర్లు కొట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 12 సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
పంత్ కేవలం తొమ్మిది బంతులను ఆడి మూడు పరుగులు చేసి మరోసారి విఫలమయ్యాడు. స్టాయినీస్ 65, అక్షర్ పటేల్ 42 పరుగులతో ఈ ఇద్దరు అద్భుతంగా రాణించి జట్టు పరువును నిలిపారు. అయినా ఢిల్లీ పరాజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ కేవలం 143 పరుగులు చేయగలిగింది. ముంబయి బౌలర్లలో బుమ్రా 4, బౌల్ట్ 2 వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బ కొట్టారు.