ISL-League 2021: తొలిసారి విజేతగా నిలిచిన ముంబై
ISL-League 2021:ఇండియన్ సూపర్ లీగ్ (ISL) 7వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ ఘన విజయం సాధించింది.
ISL-League 2021: ఇండియన్ సూపర్ లీగ్ (ISL) 7వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఏటీకే మోహన్ బగాన్‌పై విజయం సాధించిన ముంబై తొలిసారి టైటిల్ విజేతగా నిలిచింది. హోరాహోరిగా సాగిన మ్యాచ్‌లో 2-1తో ముంబై విజయం సాధించింది. బెంగళూరు తర్వాత (2018-2019 సీజన్) లీగ్ దశలో టాప్ ర్యాంక్‌లో నిలువడంతో పాటు టైటిల్‌నూ నెగ్గిన రెండో జట్టుగా ముంబై గుర్తింపు పొందింది.
మ్యాచ్ ఆరంభంలో ఏటీకే మోహన్ బగాన్‌దే జోరు సాగింది. 18వ నిమిషంలో డేవిడ్ విలియమ్స్ గోల్‌తో ఏటీకే ఆధిక్యంలోకి దూకెళ్లింది. ఈ క్రమంలో 29వ నిమిషంలో ఏటీకే ఆటగాడు జోస్ లూయిస్ ప్రత్యర్థి కొట్టిన బంతిని ఆపే క్రమంలో తమ సొంత గోల్ పోస్టులోకి బంతిని పంపేయడంతో స్కోరు సమమైంది. మ్యాచ్ ఆఖరి వరకు మరో గోల్ పడకపోవడంతో..మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. చివరి నిమిషంలో బిపిన్ సింగ్ (90వ నిమిషం) గోల్ చేయడంతో ముంబై గెలిచింది.
విజేత ముంబై సిటీకి రూ. 8 కోట్లు.. రన్నరప్ మోహన్ బగాన్‌కు రూ. 4 కోట్లు ప్రైజ్‌మనీ లభించాయి. సీజన్‌లో 14 గోల్స్ చేసిన ఇగోర్ (గోవా) గోల్డెన్ బూట్ అవార్డును దక్కించుకోగా.. మోహన్ బగాన్ గోల్‌కీపర్ ఆరిందమ్ భట్టాచార్య గోల్డెన్ గ్లవ్ అవార్డు పొందాడు.