LSG vs GT: లక్నో సూపర్ విక్టరీ.. ఇరగదీసిన యష్ ఠాకూర్
LSG vs GT: 3.5 ఓవర్లలో 30 పరుగులిచ్చి 5 వికెట్లను పడగొట్టిన ఠాకూర్
LSG vs GT: ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయాన్ని నమోదు చేసింది. కీలకమైన మ్యాచ్‌లో పట్టుసాధించింది... గుజరాత్ టైటాన్స్ ను ఖంగుతినిపించింది. లక్నో బౌలర్ యష్ ఠాకూర్ అద్భుతమైన బంతులతో గుజరాత్‌ను బోల్తా కొట్టించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. లక్నో స్టేడియం వేదికగా జరిగిన క్రికెట్ మ్యాచ్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 6 పరుగులకే వెనుదిరిగాడు. లోకేశ్ రాహుల్ నెమ్మదిగా ఆడుతూ 31 బంతుల్లో 33 పరుగులు అందించాడు. దేవదత్ పడిక్కల్ 7 పరుగులకే నిరాశ పరిచాడు. ఇక మిడిలార్డర్లో మార్కస్ స్టాయినిస్ ధాటిగా రాణించడంతో అర్థశతకాన్ని పూర్తి చేసుకుని జట్టుకు అండగా నిలిచాడు. ఆఖర్లో ఆయుశ్ బదోనీ 20 పరుగులు, నికోలస్ పూరన్ 32 పరుగులు అందించారు.
164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ పవర్ ప్లే తర్వాత తడబడింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ 31 పరుగులతో రాణించగా, శుభ్‌మన్ గిల్ 19 పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఇక కేన్ విలియమ్సన్ , శరత్ బీఆర్, దర్శన్ నల్కండే , విజయ్ శంకర్ వరుసగా పెవీలియన్ బాటపట్టారు. లక్నో బౌలర్ యశ్ ఠాకూర్ చక్కటి బంతులు విసరడంతో గుజరాత్ బ్యాటర్లకు కష్టంగా మారింది. 16 ఓవర్లకే 130 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో లక్నో జట్టు 33 పరుగుల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది.