కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కి జరిమానా; ఫైన్ల జాబితాలో ముగ్గురు కెప్టెన్లు

Kolkata Knight Riders: ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిమానాల జాబితా పెరుగుతోంది.

Update: 2021-04-22 11:27 GMT

కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (ఫొటో ట్విట్టర్)

Kolkata Knight Riders: ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిమానాల జాబితా పెరుగుతోంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే చెన్నై కెప్టెన్ ధోనీ, ముంబయి కెప్టెన్ రోహిత్ లకు రూ. 12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చేరాడు.

చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 18 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలర్లతో చర్చలు జరిపేందుకు, ఫీల్డింగ్ కుర్పు కోసం అధిక సమయాన్ని కేటాయించాడు. దీంతో సకాలంలో 20 ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. దీంతో.. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇయాన్ మోర్గాన్‌కి రూ.12 లక్షల జరిమానా పడింది.

బీసీసీఐ ఇటీవల తెచ్చిన నిబంధనల ప్రకారం.. టీ20ల్లో 20 ఓవర్లని 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన గంటకి కనీసం 14.1 ఓవర్లు వేయాలి. కానీ.. గత రాత్రి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 90 నిమిషాల్లో 20 ఓవర్లని వేయలేకపోయింది.

రెండోసారి టీమ్‌ ఈ స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే..? అప్పుడు కెప్టెన్‌కి రూ.24 లక్షల జరిమానా పడుతుంది. అలాగే టీమ్‌లోని ఆటగాళ్లకి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% కోత విధించనున్నారు. ఇక మూడోసారి కూడా ఆ తప్పిదానికి పాల్పడితే..  అప్పడు టీమ్ కెప్టెన్‌కి రూ.30 లక్షలు జరిమానా పడుతుంది. జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం పడనుంది. అలానే టీమ్‌లోని ఆటగాళ్లకి రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించనున్నారు.

Tags:    

Similar News