IPL 2020 Match 18 Updates: చెన్నై చితక్కొట్టేసింది..!
IPL 2020 Match 18 Updates: ఐపీఎల్ 2020 టోర్నీలో 18వ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా విజయలక్ష్యాన్ని చేరుకొని రికార్డు సృష్టించింది.
IPL 2020 Match 18 Live Updates and Live score | చెన్నై దారిలో పడినట్టు కనిపిస్తోంది. మొదట బౌలింగ్ లో ప్రత్యర్థిని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగింది. తరువాత పంజాబ్ ఇచ్చిన లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించి రికార్డు విజయాన్ని అందుకుంది. డుప్లిసిస్..వాట్సన్ బ్యాట్ తొ చెలరేగిన వేల పంజాబ్ బౌలర్ల దగ్గర సమాధానం లేదు. ఇద్దరూ పోటా పోటీగా బ్యాట్ ఝుళిపిస్తుంటే.. బౌండరీలు దాటుతున్న బంతుల్ని పంజాబ్ ఫీల్డర్లు చేష్టలుడిగి చూడటం తప్ప ఏమీ చేయలేకపోయారు. 179 పరుగుల విజయలక్ష్యం చెన్నైకి చాలా చిన్నదేమో అనిపించింది. అతి పెద్ద గ్రౌండ్.. దూరంగా ఉండే బౌండరీ లైన్లు.. వాట్సన్..డుప్లిసిస్ దూకుడు ముందు చిన్నబోయాయి.
ఐపీఎల్ 2020 లో ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగి అదిరిపోయే విజయంతో టోర్నీ ప్రారంభించిన చెన్నై.. తరువాత మూడు మ్యాచుల్లో వరుసగా చతికిల పడింది. పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలోకి జారిపోయింది. ఓపెనర్లు ఫాం లో లేకపోవడం.. మిడిల్ ఆర్డర్ తడబడుతుండడం.. ధోనీ కూడా అనుకున్నంత రాణించకపోవడం తొ వరుస పరాజయాల పాలైంది చెన్నై. అయితే, అది తాత్కాలికమే అని.. చెన్నై కనుక ఫాం లోకి వస్తే ఎలాంటి విధ్వంసం సృష్టించాగాలదో చూపించింది. చెన్నై ప్రకోపానికి పాపం పంజాబ్ బలి అయిపొయింది. గౌరవప్రదమైన స్కోరు కూడా ఎందుకూ పనికిరానంత ఇదిగా చితకబాదేశారు చెన్నై ఓపెనర్లు.
పంజాబ్ తన ముందుంచిన 179 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేధించింది చెన్నై. షేన్ వాట్సన్ ఫామ్‌లోకి రావడంతో పాటు మరో ఓపెనర్ డుప్లెసిస్ మళ్లీ రాణించడంతో సీఎస్‌కే 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వాట్సన్(83 నాటౌట్; 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ), డుప్లెసిస్(87 నాటౌట్; 53 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్)లు కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో సీఎస్‌కే అద్భుత విజయమ నమోదు చేసింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వాట్సన్.. తాజా మ్యాచ్‌లో విశేషంగా రాణించడంతో సీఎస్‌కే 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఇక డుప్లెసిన్ తన ఫామ్‌ను కొనసాగించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కేకు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. అంతే కాకుండా ఐపీఎల్ లో రెండో అతి పెద్ద పది వికెట్ల విజయం.
ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ 179 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్ పంజాబ్‌కు శుభారంభం లభించింది. మయాంక్ అగర్వాల్(26; 19 బంతుల్లో 3 ఫోర్లు), కేఎల్ రాహుల్(63; 52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్)లు తొలి వికెట్‌కు 61 పరుగులు జత చేశారు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరిన తర్వాత మన్‌దీప్ సింగ్(27;16 బంతుల్లో 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. కింగ్స్ పంజాబ్ స్కోరు 94 పరుగుల వద్ద ఉండగా మన్‌దీప్ సింగ్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఆపై పూరన్-రాహుల్‌ల జోడి పంజాబ్ స్కోరును చక్కదిద్దింది. ఈ జోడి మూడో వికెట్‌కు 58 పరుగుల జత చేసిన తర్వాత పూరన్(33; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 18 ఓవర్ తొలి బంతికి పూరన్ ఔట్ చేసిన శార్దూల్ ఠాకూర్..ఆ మరుసటి బంతికి రాహుల్‌ను ఔట్ చేశాడు. దాంతో 152 పరుగుల వద్ద పూరన్, రాహుల్ వికెట్లను కింగ్స్ పంజాబ్ కోల్పోయింది. వీరిద్దరూ ఔటైన తర్వాత స్కోరు మందగించింది. మ్యాక్స్‌వెల్(11 నాటౌట్), సర్పరాజ్ ఖాన్(14 నాటౌట్)ల నుంచి భారీ షాట్ల రాకపోవడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లాలు తలో వికెట్ తీశారు.