IPL 2020 Match 13Updates : ముంబయి జోరు.. పంజాబ్ బేజారు!

IPL 2020 Match 13 Updates : ముంబయి బౌలర్ల ధాటి.. ఫీల్డింగ్ జోరుకు పంజాబ్ పరాజయం పాల్పడింది.

Update: 2020-10-01 18:41 GMT

MUmbai Indians wins the match against Punjab (Image:IPL twitter)

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కు ఆశాభంగం ఎదురైంది. ముంబై కెప్టెన్ సమయోచిత ఇన్నింగ్స్ కు తోడు.. కీరన్ పోలార్డ్.. హార్దిక్ పాండ్య మెరుపులు తోడవడంతో 191 పరుగుల భారీ స్కోరు సాధించింది ముంబాయి. తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు ఏ దశలోనూ ఆ స్కోరును చేధించేలా కనిపించ లేదు. క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోవడంతో పాటు.. ముంబయి ఫీల్డింగ్ తోడవటంతొ పరుగులు తీయడం కష్టంగా మారింది రాహుల్ సేనకు దాంతో 48 పరుగుల తేడాతో ముంబాయి చేతిలో ఓడింది.  

అబుదాబి వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న టీ20లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. దీనికి ప్రతిగా బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమె సాధించింది. నిజానికి పంజాబ్ ధాటిగా చేధన ప్రారంభించింది. మొదటి ఓవర్లో 12 పరుగులు.. రెండో ఓవర్లో 12 పరుగులు సాధించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్..కెఎల్ రాహుల్ రెచ్చిపోయి ఆడారు. మూడో ఒవర్లోనూ 9 పరుగులు చేసింది పంజాబ్. దూకుడుగా ఆడుతున్న ఈ జోడీని బుమ్రా విడదీశాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో మ్యాంక్ అగర్వాల్ 25 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి పంజాబ్ స్కోర్ 38 పరుగులు. తరువాత ఓవర్లో మరో కీలక వికెట్ కోల్పోయింది పంజాబ్. క్రునాల్ పాండ్యా వేసిన ఆరో ఓవర్‌ మూడో బంతికి కరున్‌ నాయర్‌(0) బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 41 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.

రాహుల్ కు జత కూడిన పూరన్ 8 వ ఓవర్లో ధాటిగా ఆడాడు. ఒక భారీ సిక్స్, ఒక ఫోర్ కొట్టాడు. అయితే, ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. రాహుల్ చాహర్ వేసిన తరువాతి ఓవర్లో కెప్టెన్ కెఎల్ రాహుల్(17) ఔటయ్యాడు. పది ఓవర్లకు మూడు వికెట్లను కోల్పోయి 72 పరుగులు చేసింది. పూరన్ వేగంగా పరుగులు చేయడంతో 11 ఓవర్, 12 ఓవర్లలో స్కోరు బోర్డు కొద్దిగా పరిగెత్తింది. అయితే, 14 వ ఓవర్ రెండో బంతికి పంజాబ్ స్కోరు 101 పరుగుల వద్ద పాటిన్‌సన్‌ బౌలింగ్ లో నికోలస్ పూరన్ (44) ఔటయ్యాడు. 15 వ ఓవర్లో మాక్స్‌వెల్‌(11) ఔటయ్యాడు. దీంతో 15 ఓవర్లు పూర్త్యయ్యేసరికి పంజాబ్ ఐదు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసి కష్టాల్లో పడింది.

ఇక 16 వ ఓవర్లో బుమ్రా తిప్పేశాడు. ఈ ఓవర్లో మూడు పరుగులిచ్చి నీషం (7) వికెట్ తీశాడు. తరువాత 18 వ ఓవర్లో పాటిన్‌సన్‌ వేసిన తొలి బంతికి సర్ఫరాజ్‌ ఖాన్‌(7) ఔటయ్యాడు. వెంటనే 19 వ ఓవర్లో బౌల్ట్ చేతిలో రవిబిష్ణోయ్(1) ఔటయ్యాడు. ఆ తరువాత ఇరవై ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి అపజయం పాలైంది.

అంతకు ముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు భారీ స్కోరు చేసింది. మొదట కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (70; 45 బంతుల్లో 8x4, 3x6) అర్ధశతకంతో మెరవగా.. చివర్లో కీరన్‌ పొలార్డ్ ‌(47; 20 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్‌ పాండ్య (30; 11 బంతుల్లో 3x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. దీంతో పంజాబ్‌.. ముంబయి ముందు భారీ లక్ష్యం ఉంచింది. ఆది నుంచీ కట్టుదిట్టంగా బంతులేసిన పంజాబ్‌ బౌలర్లు చివర్లో చేతులెత్తేశారు. దీంతో పాండ్య, పొలార్డ్‌ బౌండరీల వర్షం కురిపించారు.

కాట్రెల్‌ వేసిన తొలి ఓవర్‌లో ఓపెనర్‌ డికాక్ ‌(0) క్లీన్‌బౌల్డ్‌ అవ్వగా ముంబయి పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆపై నాలుగో ఓవర్‌లో వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (10) అనవసర పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. దీంతో ముంబయి 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆపై రోహిత్‌తో జోడీ కట్టిన ఇషాన్‌ కిషన్ ‌(28; 32 బంతుల్లో 1x4, 1x6) తొలుత వికెట్‌ కాపాడుకునేందుకు నెమ్మదిగా ఆడాడు. తర్వాత రెచ్చిపోవాలని ప్రయత్నించగా.. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన 14వ ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌ ఆడి బౌండరీ వద్ద కరున్‌ నాయర్‌ చేతికి చిక్కాడు. దీంతో 62 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక రోహిత్‌ 16వ ఓవర్‌లో ధాటిగా ఆడి 21 పరుగులు సాధించడంతో పాటు అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే షమి వేసిన తర్వాతి ఓవర్‌లో మరో భారీ షాట్‌ ఆడి బౌండరీ లైన్‌ వద్ద జేమ్స్‌ నీషమ్‌ చేతికి చిక్కాడు. దీంతో ముంబయి 124 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఆపై హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌ పంజాబ్‌ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. వీరిద్దరూ 23 బంతుల్లో 67 పరుగులు చేయడంతో రాహుల్‌ జట్టు ముందు భారీ లక్ష్యం నిర్దేశించారు.

Tags:    

Similar News