IPL 2020 : ఐపీఎల్ 2020 కి డ్రీమ్ 11 ని టైటిల్ స్పాన్సర్ గా బీసీసీఐ ఎంపిక చేసింది. దీనికి సంబంధించి దాదాపు వారం రోజుల నుంచి చర్చలు జరుగుతూ ఉండగా నేడు టైటిల్ స్పాన్సర్ గా, డ్రీం లెవెన్ ని ఎంపిక చేస్తున్నట్టు బీసీసిఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 2018 నుంచి 2022 వరకు తొలుత వీవో సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.400 కోట్లకు పైగా చెల్లించేది. ఇటీవల భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఇక్కడ డ్రాగన్ వస్తువుల బహిష్కరణ ఉద్యమం ఊపందుకుంది.
ఈ నేపథ్యంలోనే వీవో ఈ ఏడాది తప్పుకుంటున్నట్లు కొద్ది రోజలు క్రితం ప్రకటించింది. దీంతో ఐపీఎల్ 2020కి సంబంధించి కొత్త స్పాన్సర్ ఎవరు వస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం రిలయన్స్ జియో, బైజూస్, టాటాసన్స్, అన్ అకాడమీ, డ్రీమ్ 11 వంటి పెద్ద సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు 250 కోట్ల రూపాయలతో డ్రీమ్11 ఏడాది కాలానికి గానూ ఐపీఎల్ 2020 స్పాన్సర్‌షిప్ హక్కులను పొందింది. ఐపీఎల్-2020 సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకూ యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుధాబిలో నిర్వహించనున్నారు.