WTC Final: టీమిండియాకి గుడ్‌న్యూస్.. ఫైనల్ అయ్యాక 20 రోజుల గ్యాప్
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లకి 20 రోజుల విరామం దొరికింది.
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లకి 20 రోజుల విరామం దొరికింది. ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న భారత టెస్టు జట్టు సౌథాంప్టన్ స్టేడియం పరిసరాల్లోని హోటల్‌లో 10 రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. జూన్ 18 నుంచి 22 వరకు న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది.
ఇంగ్లాండ్ గడ్డపై భారత క్రికెటర్లు దాదాపు 100 రోజులపైనే బయో సెక్యూర్ బబుల్‌లో ఉండనున్నారు. అయితే ఇలా ఉండడంతో ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపనుందని బీసీసీఐ ఆందోళన చెందుతోంది. అలాగే సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ మొదలుకానుంది. దాంతో.. భారత క్రికెటర్లు ఇంగ్లాండ్ నుంచి యూఏఈ కి చేరుకుని ఐపీఎల్ 2021 సీజన్ బబుల్‌కి వెళ్లనున్నారు. ఆ మ్యాచ్‌లు 27 రోజుల పాటు జరగనున్న విషయం తెలిసిందే. ఇలా చూస్తే.. దాదాపు 127 నుంచి 130 రోజులు భారత క్రికెటర్లు బయో- సెక్యూర్ బబుల్‌లోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 24న ముగియనుంది. ఈ ఫైనల్ తరువాత భారత క్రికెటర్లు బబుల్ నుంచి బయటకు రానున్నారు. ఓ 20 రోజుల పాటు ఇంగ్లాండ్‌లో సరదాగా ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపిన తర్వాత జులై 14న మళ్లీ టీమిండియా మేనేజ్‌మెంట్‌కి రిపోర్ట్ చేయాలి. అయితే.. ఈ విరామ సమయంలో విదేశాలకి వెళ్లకూడదని, అలానే కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న ప్రదేశాల్లోనూ పర్యటించొద్దని బీసీసీఐ సూచించిందంట.