IND vs PAK: నేటినుంచే ఆసియాకప్.. పాక్‌తో ఢీ కొట్టనున్న భారత్.. రికార్డులు ఇవే..!
Women's Asia Cup 2024: డిఫెండింగ్ ఛాంపియన్ భారత మహిళల జట్టు శుక్రవారం ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో అతిపెద్ద ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
Women's Asia Cup 2024: డిఫెండింగ్ ఛాంపియన్ భారత మహిళల జట్టు శుక్రవారం ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో అతిపెద్ద ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. అక్టోబర్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహకానికి ఈ టోర్నీ అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు ఆసియాకప్‌లో ఆధిపత్యం ప్రదర్శించింది.
కాగా, ఆసియా కప్ T20 టైటిల్‌ను భారత్ మూడు సార్లు గెలుచుకుంది. ఆసియా కప్‌లో 50 ఓవర్ల ఫార్మాట్‌ను భారత్ నాలుగు సార్లు గెలుచుకుంది. మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ 20 మ్యాచ్‌లకు గాను 17 విజయాలు సాధించింది. 2022 ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో ఆడిన 14 మ్యాచ్‌ల్లో భారత్ 11 విజయాలు నమోదు చేసింది. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. కాగా, మూడు టీ20 మ్యాచ్‌ల్లో రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కాగా, మేలో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 3-0తో పాకిస్థాన్‌ను ఓడించింది.
ఫుల్ ఫాంలో భారత జట్టు..
స్మృతి మంధాన అద్భుతమైన ఫామ్‌లో ఉంది. పూజా వస్త్రాకర్ ఆల్ రౌండ్ ఆటతో ఆకట్టుకుంటుంది. దక్షిణాఫ్రికాతో ఆడిన 3 మ్యాచ్‌లలో ఆమె 8 వికెట్లు పడగొట్టింది. స్పిన్నర్ రాధా యాదవ్ కూడా విజయవంతంగా రాణిస్తోంది. స్పిన్నర్లలో దీప్తి శర్మ, సజీవన్ సజ్నా, శ్రేయాంక పాటిల్ ఉన్నారు.
ఆసియా కప్‌నకు పాకిస్థాన్ కెప్టెన్‌గా నిదా దార్‌ను కొనసాగించింది. అయితే, జట్టులో చాలా మార్పులు చేశారు. ఇరామ్ జావేద్, ఒమైమా సోహైల్, సయ్యదా అరూబ్ షా ఈ ఏడాది తొలిసారిగా జట్టులో స్థానం సంపాదించగా, తస్మియా రుబాబ్ అరంగేట్రం చేసింది.
గ్రూప్-ఏలో నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లు కూడా తొలిరోజు తలపడనున్నాయి. రెండు గ్రూపుల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌లో తలపడతాయి. నేపాల్ 2016 తర్వాత తొలిసారిగా టోర్నీలో ఆడుతుండగా, ఇది యూఏఈకి వరుసగా రెండో టోర్నీ.
పిచ్ రిపోర్ట్..
శ్రీలంకలోని రంగి దంబుల్లా స్టేడియంలోనే అన్ని మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ 3 మహిళల టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఇరు జట్ల కెప్టెన్లు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలని కోరుకుంటుంటారు.
వాతావరణ నివేదిక, మ్యాచ్ ప్రిడిక్షన్..
ప్రస్తుతం భారత మహిళల జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. తాజాగా దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. హెడ్ టు హెడ్ రికార్డులను చూస్తే.. పాకిస్థాన్ కంటే భారత జట్టు ముందుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచే అవకాశాలు 90% ఉన్నాయి. నేడు దంబుల్లాలో వర్షం కురిసే అవకాశం లేదు.
మహిళల ఆసియా కప్ విజేతలు మహిళల ఆసియా కప్ 2004లో ప్రారంభమైంది. మహిళల ఆసియా కప్ ఇప్పటి వరకు 8 సార్లు జరిగింది. ఇందులో భారత్ 7 సార్లు ఈ టోర్నీని గెలుచుకోగా, బంగ్లాదేశ్ 1 సారి ఆసియా కప్‌ను గెలుచుకుంది.
ప్రాబబుల్ ప్లేయింగ్ XI..
ఇండియా : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, డి హేమలత, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్.
పాకిస్థాన్ : నిదా దార్ (కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, ఫాతిమా సనా, ఇరామ్ జావేద్, నష్రా సంధు, ఒమైమా సోహైల్, సాదియా ఇక్బాల్, సిద్రా అమీన్, సయ్యదా అరుబ్ షా, తస్మియా రుబాబ్.