India vs England: ముచ్చటగా 'మూడు' రోజులకే ముగించేశారు!

India vs England: టీమిండియా దెబ్బకు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు విలవిలలాడారు. కనీసం నూట ఏభై పరుగులు కూడా చేయలేక చేతులెత్తేశారు.

Update: 2021-03-06 11:48 GMT
టీమిండియా విజయ విలాసం (ఫోటో బీసీసీఐ ట్విట్టర్)

India vs England: స్వంత గడ్డ మీద భారత్ తో ఆడాలంటే ప్రత్యర్థి క్రికెట్ జట్లకు ఎప్పుడూ వెన్నులో వణుకే. ఇక ఆస్ట్రేలియా గడ్డ మీద ఎన్నో ప్రతిబంధకాల మధ్య జరిగిన సిరీస్ లో ఘన విజయం సాధించిన తరువాత టీమిండియాను స్వదేశంలో ఎదుర్కోవడం అంటే.. మామూలుగా ఉండదు. ఇంగ్లాండ్ జట్టు భారత్ లో అడుగుపెట్టేసరికి ఉన్న అభిప్రాయం అదే. అయితే, తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్గ్లాండ్ ఆటగాళ్ళ ధాటికి టీమిండియా చేతులెత్తేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మొదటి టెస్ట్ ఓడిపోవడం అంటే ఏ జట్టుకైనా పెద్ద ఎదురుదెబ్బే. కానీ, ఆ దెబ్బతో టీమిండియా పులిలా ఎగసిపడింది. ఇంగ్లాండ్ టీం కు చుక్కలు చూపించింది. వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్ లు తిరుగులేని ఆధిక్యంతో గెలిచి సిరీస్ సాధించింది. ఇక నాలుగో టెస్ట్ లో భారత్ ఆటతీరు చూస్తె టెస్ట్ క్రికెట్ లో ఏ టీం కైనా చెమటలు పట్టేలా ఉంది. కేవలం మూడురోజుల్లో మ్యాచ్ ముగించి.. తన బలాన్ని టెస్ట్ క్రికెట్ ప్రపంచానికి మరోసారి పరిచయం చేసింది టీమిండియా!

నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మరో రెండు రోజుల ఆట మిగిలివుండగానే ఇన్నింగ్స్ 25 పరుగులతో కోహ్లీ సేన ఘన విజయం నమోదు చేసింది. నాలుగు టెస్టుల సిరీస్ 3-1 తేడాతోకైవసం చేసుకుంది. మూడో టెస్టును రెండు రోజుల్లో ముగించిన భారత్, ఆఖరి టెస్టును మూచ్చటగా మూడు రోజుల్లో ముగించి సత్తాచాటింది.

ఇక ఈ టెస్టులో భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 135 పరుగులకే ఆలౌటై మరో చెత్త రికార్డు నమోదు చేసింది. భారత బౌలర్లు అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌లు మరోసారి తమ స్పిన్ మాయాజాలంతో చెలరేగారు. రెండు ఇన్నింగ్స్ మరో బౌలర్ కు అవకావం దక్కనియకుండా ఇరువురు కలిసిన చెరో ఐదు వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్ తో భారత్ బౌలర్ అక్షర్ పటేల్ అరంగేట్రంలో చేసిన మ్యాచుల్లో కీలక ఐదు వికెట్లు తీసిన క్రికెటర్ల జాబితాలో తొలి స్థానం సాధించాడు.

రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ లారెన్స్ 95బంతుల్లో 50పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ జో రూట్ (30) పరుగులతో రెండో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ క్యూ కట్టడంతో రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 205 పరుగులు చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 365 పరుగులు చేసింది. రిషభ్‌పంత్‌ సెంచరీ చెలరేగడు. చివర్లొ ఆల్ రౌండర్ వాషింగ్టన్‌ సుందర్‌ 96 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

ఈ సిరీస్ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ లో అగ్రస్థానికి ఎగబాకింది. ద్వితీయ స్థానంలో న్యూజిలాండ్ కొనసాగుతుంది.ఇప్పటికే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ కైవసం చేసుకున్న భారత్ జూన్ 18 నుంచి లాడ్ప్ వేదికగా న్యూజిలాండ్ తో తలపడనుంది. ఇక భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదు టీ20ల సిరీస్ మార్చి 12 నుంచి ప్రారంభం కానుంది.

మూడో టెస్టు ఓటమి తర్వాత నుంచి పిచ్ పై ఇంగ్లాండ్ సినియర్ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పిచ్ కంప్లీట్ గా బౌలర్లకు అనుకూలంగా ఉందని ఆరోపిస్తూ వచ్చారు. అయితే భారత సినీయర్లు మాత్రం అందుకు విభిన్నంగా స్పందిస్తున్నారు. మ్యాచ్ ఇంగ్లాండ్ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని, పిచ్ నిందించడం సరైందికాదని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News