అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను ఆటాడుకున్న స్పిన్నర్లు రెండోరోజే భారత్‌కు విజయాన్ని కట్టబెట్టారు. అటు రెండో రోజు ఆటలో ఏకంగా 17 వికెట్లు నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లీష్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్ల ధాటికి కేవలం 81 పరుగులకే పెవిలియన్ చేరింది. దీంతో 47 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు వికెట్ నష్టపోకుండానే విజయాన్ని కట్టబెట్టారు.
స్పిన్నర్లకు మొతేరా పిచ్ స్వర్గధామంలా మారడంతో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన భారత బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో జోఫ్రా ఆర్చర్ వికెట్ తీయడంతో అశ్విన్ టెస్టుల్లో 400వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ కేవలం 77 టెస్టుల్లోనే ఈ మైలురాయి అందుకున్నాడు.