Narendra Modi Stadium: అహ్మదాబాద్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచుల్లో ఓడని భారత్
Narendra Modi Stadium: 10 మ్యాచుల్లో విజయం.. 8 మ్యాచుల్లో పరాజయం
Narendra Modi Stadium: సొంతగడ్డపై ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో.. అజేయ రికార్డు కొనసాగిస్తూ భారత్ ఫైనల్ చేరింది. తుదిపోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దృష్టంతా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం మీదకు మళ్లింది. ప్రపంచంలోనే పెద్దదైన ఈ క్రికెట్ స్టేడియంలో లక్షా 32 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్ చూసే అవకాశముంది. 1982లో సర్దార్ పటేల్ స్టేడియంగా 54 వేల సీటింగ్ సామర్థ్యంతో ఇది ప్రారంభమైంది. మొతేరా స్టేడియంగానూ ప్రసిద్ధికెక్కింది.
ఈ మైదానంలో మొత్తం 11 పిచ్‌లున్నాయి. టెస్టు క్రికెట్లో సునీల్ గవాస్కర్ 10 వేల పరుగుల మైలురాయిని చేరుకుంది ఇక్కడే. టెస్టుల్లో 432వ వికెట్‌తో అప్పుడు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కపిల్ దేవ్ రికార్డు సృష్టించింది కూడా ఇక్కడే. ఇక్కడ 1987, 1996 ప్రపంచకప్‌ల్లో ఒక్కో మ్యాచ్ జరిగింది. 2011 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. వన్డేల్లో 18 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా సచిన్ ఇక్కడే చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో సచిన్ తొలి డబుల్ సెంచరీని ఇక్కడే సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్ల కెరీర్‌ను, 30 వేల పరుగులను ఇక్కడే పూర్తిచేసుకున్నాడు.
అహ్మదాబాద్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో భారత్ ఇప్పటివరకూ ఓడిపోలేదు. 1987లో జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. 2011 ప్రపంచకప్ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఈ ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఇప్పుడదే జోరు కొనసాగించి ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించాలనే భారత్ చూస్తోంది. ఓవరాల్‌గా ఇక్కడ ఇప్పటివరకూ 18 వన్డేలు ఆడిన భారత్ 10 మ్యాచ్‌ల్లో గెలిచి, 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. రికార్డులు చూస్తే ఇక్కడ అత్యధిక స్కోరు దక్షిణాఫ్రికా 365 రన్స్ చేసింది.
ఇక్కడి పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా సహకరించే అవకాశముంది. నల్లమట్టి పిచ్‌పై ఫైనల్ జరిగే అవకాశముంది. ఈ టోర్నీలో జట్లు 400 పరుగులు చేసినా విజయంపై ధీమాగా ఉండలేని పరిస్థితి. కానీ ఈ ఫైనల్లో 315 పరుగుల స్కోరును కాపాడుకోవచ్చని స్థానిక క్యూరేటర్ చెప్పారు. మరోవైపు స్పిన్ పిచ్ రూపొందిస్తున్నారని, ఫైనల్లో సిరాజ్ స్థానంలో అశ్విన్‌ను ఆడించే అవకాశముందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మంచి బౌన్స్ లభించి ఇక్కడి పిచ్ సాధారణంగా పేసర్లకే ఎక్కువ అనుకూలమనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో జోరుమీదున్న మన పేస్ త్రయం మరోసారి చెలరేగి జట్టును విశ్వవిజేతగా నిలపాలని అభిమానులు కోరుకుంటున్నారు. వాంఖడే సరసన నరేంద్ర మోదీ స్టేడియం చేరాలని ఆకాంక్షిస్తున్నారు.
39 ఏళ్ల అహ్మదాబాద్ స్టేడియం చరిత్రలో ఇప్పటి వరకు 30 వన్డేలు జరిగాయి. ఇక్కడి పిచ్‌పై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 243. ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్‌లో భారీ స్కోర్లు నమోదవుతున్న తరుణంలో 243 రన్స్ తక్కువగానే కనిపిస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 15సార్లు గెలిస్తే..చేజింగ్ చేసిన టీమ్ కూడా అన్నేసార్లు నెగ్గింది. ఇక ఇక్కడ టాస్ గెలిచిన జట్టు మ్యాచ్ గెలిచే అవకాశం 56.67 శాతం. అంటే టాస్ నెగ్గే జట్టుకే విజయావకాశాలు అధికం.
భారత జట్టు అహ్మదాబాద్ స్టేడియంలో మొత్తం 19 మ్యాచ్‌లు ఆడింది. 11 మ్యాచుల్లో గెలుపొంది ఎనిమిదింటిలో ఓడింది. ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ నాలుగింటిలో గెలిచి రెండింటిలో పరాజయం చవిచూసింది. ఈ స్టేడియంలో రెండు జట్లు మూడు మ్యాచ్‌ల్లో పరస్పరం తలపడ్డాయి. మెన్ ఇన్ బ్లూ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించగా, కంగారూలు ఒకటి గెలిచారు.
2003 ఫైనల్ మాదిరే ఇప్పుడు కూడా భారత్-ఆస్ట్రేలియా టైటిల్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. కానీ ఈసారి టీమిండియా పదికి పది మ్యాచ్‌లు గెలిచి సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు కంగారూలు వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు నెగ్గిన ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. రెండింటిలో ఏ జట్టు వరుస విజయాలకు బ్రేక్ పడుతుందో చూడాలి. ఈసారి లీగ్ దశలో ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది. కానీ నాకౌట్‌లలో ఆసీస్ ఆట తీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ ఎలా ఉంటుందోననే ఉత్కంఠ సర్వత్రా ఏర్పడింది.
అయితే స్పిన్‌కు అనుకూలించే వికెట్ సిద్ధం చేయనున్నారనే వార్తలు బలంగా వస్తున్నాయి. వికెట్ కనుక స్పిన్‌కు అనుకూలిస్తే..టీమిండియాది ఒకింత పైచేయి కానుంది. ఈ వరల్డ్‌క్‌పలో ఇప్పటిదాకా అహ్మదాబాద్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. నాలుగింటిలో మూడుసార్లు చేజింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. అలాగే నాలుగు మ్యాచ్‌ల్లో ఏ జట్టూ 300 రన్స్ చేయలేదు. మొత్తం 57 వికెట్లు నేలకూలాయి. ఇందులో 36 వికెట్లు పేసర్లకు, 21 వికెట్లు స్పిన్నర్లకు దక్కాయి. అంటే ఇక్కడ పేసర్లదే పైచేయన్నమాట. ఈ వేదికలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్‌పై ఆస్ర్టేలియా విజయాలు సాధించాయి.