ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ.. టిమ్ పైన్ దళానికి భారీ జరిమానా
బాక్సింగ్ డే టెస్టులో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
బాక్సింగ్ డే టెస్టులో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లలో కోత పడింది. అదే సమయంలో స్లో ఓవర్ రేట్ ఆసీస్ జట్టుకు నలభై శాతం జరిమానా పడింది. నిర్ణీత సమయానికి 2 ఓవర్లు తక్కువగా వేయడంతో ఆసీస్‌కు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లలో కోతతో పాటు భారీ జరిమానా విధించారు. ఆసీస్ స్లో ఓవర్‌రేట్‌ను మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ధృవీకరించారు. ఆ జట్టు టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ అంగీకరించడంతో ఎటువంటి విచారణ లేకుండానే పాయింట్లలో కోతతో పాటు జరిమానా విధించారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనల్లో భాగంగా టెస్టు చాంపియన్‌షిప్‌లో స్లో ఓవర్ రేటు పడితే కోత తప్పదు. ఆర్టికల్ 16.11.2 నిబంధన ప్రకారం ఓవర్ ఆలస్యానికి రెండు టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లతో పాటు 20 శాతం ఫీజు కోత పడుతుంది. ఇక్కడ ఆసీస్2ఓవర్లు ఆలస్యం చేయడంతో నాలుగు పాయింట్లు, 40 శాతం మ్యాచ్ ఫీజును కోల్పోనుంది. రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ ను 200పరుగులకే కట్టడి చేశారు భారత బౌలర్లు. దీంతో 69 పరుగుల విజయలక్షయంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసి విజయదుందుభి మోగించింది.