సత్తా చాటిన సచిన్, సెహ్వాగ్: బంగ్లాపై ఇండియా లెజెండ్స్ గెలుపు
Road Safety World Series T20: బంగ్లాదేశ్ లెజెండ్స్ తో ఇండియా లెజెండ్స్ మొదటి మ్యాచ్‌లో తలపడ్డారు.
Road Safety World Series T20: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ భాగంగా రాయ్‌పూర్‌లో ఈ రోజు సాయంత్రం బంగ్లాదేశ్ లెజెండ్స్లతో ఇండియా లెజెండ్స్ మొదటి మ్యాచ్‌లో తలపడ్డారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్ లెజెండ్స్. నజీముద్దీన్ 49 పరుగులతో రాణించగా..మిగతా బ్యాట్‌మెన్స్ అంతా వెంటవెంటనే పెవిలియన్ కే చేరడంతో 19.4 ఓవర్లలో ఆ జట్టు 109 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియా లెజెండ్స్ టీంలో వినయ్ కుమార్, ప్రగ్నాన్ ఓజా, యువరాజ్ సింగ్ తలా రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్..కేవలం 10.1 ఓవర్లలోనే టార్గెట్ ను పూర్తి చేసి విజయం సాధించింది. ఓపెనర్లుగా వచ్చిన సెహ్వాగ్(80 పరుగులు, 5 సిక్సులు, 10ఫోర్లు), సచిన్(33 పరుగులు, 5 ఫోర్లు) లు బ్యాటింగ్ లో తమ సత్తాను చాటారు.
దూకుడు గా ఆడే సెహ్వాగ్ మునపటి లాగే బౌలర్లపై విరుచుపడి మరీ బౌండరీలు సాధించాడు. మొదటి ఓవర్లోనే వరుసగా 3 ఫోర్లు, సిక్సు బాది తనలో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించేలా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా తొలి మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించారు.
ఇక, కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాలను రద్దు చేయడంతో గత సంవత్సరం సిరీస్ మొదటి ఎడిషన్ కేవలం నాలుగు మ్యాచ్‌ల తర్వాత నిలిపివేశారు. మహారాష్ట్రలో పెరుగుతున్న కేసుల కారణంగా ప్రస్తుత సిరీస్ వేదికను ముంబై, పూణే నుండి రాయ్‌పూర్‌కు మార్చారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ..సీనియర్ క్రికెట్లరు ఆడుతున్న రోడ్ సేప్టీ వరల్డ్ సిరీస్ టీ 20 టోర్నమెంట్ శుక్రవారం నుంచి మొదలైంది. ఈ టోర్నమెంట్ 2020 మార్చి 5వ తేదీ నుంచి 16వరకూ జరగనుంది. సునీల్ గవాస్కర్‌కు చెందిన పీఎంజీ, మహారాష్ట్ర రోడ్డు భద్రత విభాగం ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ టోర్నీలో ఐదు దేశాలకు చెందిన రిటైర్డ్ క్రికెటర్లు ఆడనున్నారు.
2021 రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో మొత్తం 15 టీ 20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇవన్నీ కూడా రాయ్‌పూర్‌లో జరుగుతాయి. ఈ సిరీస్ మార్చి 5 నుండి మార్చి 16 వరకు ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు మొదలవుతాయి. సెమీ-ఫైనల్స్ మార్చి 17, బుధవారం ఒక మ్యాచ్. మార్చి 19, శుక్రవారం రెండో మ్యాచ్ జరగనున్నాయి. ఈ సిరీస్ చివరి టీ 20 ఫైనల్ మ్యాచ్ మార్చి 21, ఆదివారం జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.