SRH VS MI: ఐపీఎల్ రికార్డులను బద్దలు కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్

SRH VS MI: 16 బంతుల్లోనే అర్థశతకం నమోదు చేసిన అభిషేక్ శర్మ

Update: 2024-03-28 01:47 GMT

SRH VS MI: ఐపీఎల్ రికార్డులను బద్దలు కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్

SRH VS MI: బౌండరీల మోత.. సిక్సర్ల హోరుతో... స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన బ్యాటర్లు... ఇదీ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ తీరు. ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్యజరిగిన ఐపీఎల్ మ్యాచ్ జనరంజకంగా సాగింది. బ్యాట్స్ మెన్ల ఆటతీరుతో స్కోరు బోర్డుపై క్షణక్షణానికి మారిన గణాంకాలు అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపుచేసింది. ఇరుజట్ల మధ్యసాగిన మ్యాచ్ ప్రపంచరికార్డుల్ని తిరగరాసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ను మట్టికరిపించింది. 16 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన అర్థసెంచరీ చేసిన అభిషేక శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు, ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కుదిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. బౌండరీల మోతతో ఉప్పల్ స్టేడిమం దద్దరిల్లింది. పదునైన షాట్లతో హైదరాబాద్ బ్యాటర్లు విరుచుకుపడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. హైదరాబాద్ ఆటగాళ్లలో మయాంక్ అగ్వాల్ మినహాయిస్తే... మిలిగిలిన అందరూ ముంబై బౌలర్లను చీల్చి చెండాడారు. నిర్ణీత 20 ఓవర్లలో 277 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటి దాకా ఐపీఎల్ లో 263 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యధిక పరుగులు చేసిన జట్టుపేరుతో ఉన్న రికార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రేక్ చేసింది.

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పోటీపడి వేగవంతమైన అర్థశతకాలతో ప్రపంచ రికార్డులను కైవసం చేసుకున్నారు. ట్రావిస్ హెడ్ తొలుత 18 బంతుల్లో అర్థశతకం పూర్తిచేస్తే... నిమిషాల వ్యవధిలోనే అభిషేక్ శర్మ 16 బంతుల్లో అర్థశతకాన్ని నమోదు చేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మ్యాచ్ లోనే హైలైట్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

బౌండరీలతో విరుచుకుపడే కొద్దీ స్టేడియంలో అభిమానుల కేరింతలతో విశేషైన మద్దతు లభించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్లు ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. హైదరాబాద్ ఆటగాళ్లు ఒకరుకు మించి మరొకరు బ్యాట్లను ఝుళిపించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ట్రావిస్ హెడ్ వేగంగా 62 పరుగులు చేసిన తర్వాత పెవీలియన్ బాటపడితే... ఆతర్వాత అభిషేక్ శర్మ63 పరుగులతో వెనుదిరిగాడు. మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్ జోడీ కలిసి విధ్వంసం సృష్టించింది. సిక్సర్ల హోరుతో ఉప్పల్ స్టేడియం దద్దరిల్లింది. మార్కరమ్ 42 పరుగులతో సరిపెట్టుకోగా, హెన్రిచ్ క్లాసెన్ 80 పరుగులు అందించాడు. హైదరాబాద్ ఆటగాళ్లందరూ కలిసి 19 ఫోర్లు, 18 సిక్సర్లు నమోదు చేశారు.

278 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై బ్యాట్స్ ఓపెన్లు రోహిత్ శర్మ, ఇశాన్ కిషన్ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్ బ్యాట్స్ మెన్ల ఆటను మరిపించే ప్రయత్నం చేశారు. బౌండరీలతో విరుచుకుపడటంతో భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించే విధంగా కన్పించారు. హైదరాబాద్ బౌలర్లు చక్కటి బంతులు సంధించడంతో పరుగుల ప్రవాహాన్ని నియంత్రించడంతోపాటు వికెట్లను పడగొట్టగలిగారు.

ముంబై ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ 34 పరుగులతో పెవీలియన్ బాట పట్టాడు. ఆతర్వాత ఊపు మీద ఉన్న రోహిత్ శర్మ 26 పరుగుల వద్ద బోల్తా కొట్టాడు. చక్కటి షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన నమన్ ధీర్ 30పరుగులతో క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ ముంబై జట్టుకు ఆశాసౌధంగా నిలిచాడు. జట్టును విజయ తీరం చేర్చేలా కన్పించిప్పటికీ... వ్యక్తిగత స్కోరు 64 పరుగులవద్ద క్యాచ్ రూపంలో ఔటయ్యాడు.

కెప్టన్ హార్థిక్ పాండ్యాతో కలిసి టిమ్ డేవిడ్ దుమ్ముదులిపే ప్రయత్నం చేశారు. విజయలక్ష్యానికి చేరువయ్యే ప్రయత్నంలో మిగిలిన బంతులు, సాధించాల్సిన పరుగులకు అంతరం పెరిగింది. 24 పరుగులతో హార్థిక్ పాండ్యా ఔటైన తర్వాత టిమ్ డేవిడ్ బౌండరీలు, సిక్సర్లతో ఆశలు రేకెత్తించినా ప్రయోజనం లేకపోయింది. 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో డేవిడ్ 42 పరుగులు అందించాడు. రొమారియో షెఫెర్డ్ 15 పరుగులు నమోదు చేశాడు. దీంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 246 పరుగులకే పరిమితమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 61 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై జట్టు ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 20 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ 200 మ్యాచ్ లను ఆడిన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఉప్పల్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సాధికార విజయాన్ని సొంతంచేసుకుని ప్రత్యర్థి జట్లకు సవాల్ విసిరింది. ఇన్నాళ్లు బ్యాటింగ్ లైనప్ లో సమస్య, బౌలింగ్ దళంలో లోపాలు అని వేలెత్తి చూపిన వారికి ధీటైన సమాధానమిచ్చింది. హైదరాబాద్ జట్టంటే... దడపుట్టించే పనిచేశారు. బ్యాటింగ్ విషయంలో హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మార్కరమ్ బ్యాటు ఝుళిపిస్తే, అనుభవంతో బంతులను సంధించే బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, కెప్టన్ ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్ అద్భుతమైన బంతులు సంధించి, ముంబై ఆటగాళ్లదూకుడుకు కళ్లెం వేశారు. ఐపీఎల్ లో ఆరెంజ్ ఆర్మీ అదరగొట్టింది. అబ్బురపరచింది. సరికొత్త రికార్డులతో... అందరిచేతా అబ్బా అనిపించింది. ఇదే తరహా ఆటతీరును కనబరిస్తే... ఈ సీజన్లో ఐపీఎల్ ట్రోఫీ... హైదరాబాదేనని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు అంటున్నారు. ఆల్ దీ బెస్ట్ హైదరాబాద్.

Tags:    

Similar News