World Chess Championship 2023: చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్
World Chess Championship 2023: ప్రపంచ విజేతగా తొలి చైనా ఆటగాడు
World Chess Championship 2023: చెస్ ప్రపంచ ఛాంపియన్ అనగానే దశాబ్ద కాలంగా గుర్తుకొస్తున్న పేరు.. మాగ్నస్ కార్ల్‌సన్‌దే. ఇక ఆ పేరు చరిత్రే. ఇకపై రెండేళ్ల పాటు ఆ కిరీటం డింగ్ లిరెన్‌దే. ఈ చైనా గ్రాండ్‌మాస్టర్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో నెపోమ్నిషిని టైబ్రేక్‌లో ఓడించి నయా ఛాంపియన్‌గా అవతరించాడు.
ప్రపంచ చెస్ తెరపై మరో కొత్త ఛాంపియన్.గా చైనా ఆటగాడు డింగ్ లిరెన్ నిలిచాడు. 14 గేమ్‌ల పాటు సాగిన ఈ సమరంలో రష్యాకు చెందిన ఇయాన్ నెపోమ్నిషిని టైబ్రేక్‌లో ఓడించాడు. పద్నాలుగు గేముల్లో లిరెన్-ఇయాన్ చెరో ఏడు గేమ్‌లు నెగ్గడంతో విజేతను తేల్చడానికి టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్‌లో ర్యాపిడ్ పద్ధతిలో జరిగిన నాలుగు గేమ్‌లతో తొలి మూడు గేమ్‌లు డ్రా అయ్యాయి. నాలుగో గేమ్‌ను సొంతం చేసుకున్న లిరెన్ టైటిల్ ఎగరేసుకుపోయాడు.
ప్రపంచ విజేత అయిన తొలి చైనా ఆటగాడిగా 30 ఏళ్ల లిరెన్ ఘనత సాధించాడు. మహిళల ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కూడా చైనా ఖాతాలోనే ఉండడం విశేషం. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఆసియా నుంచి ప్రపంచ విజేత అయింది లిరెన్ మాత్రమే. డింగ్ గెలుపుతో పదేళ్ల కార్ల్‌సన్ ఏకచక్రాధిపత్యానికి తెరపడింది. ఈసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆడకూడదని డిఫెండింగ్ ఛాంపియన్ కార్ల్‌సన్ నిర్ణయించుకున్నాడు.