భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ప్రారంభించిన కోళ్ల వ్యాపారానికి బర్డ్‌ఫ్లూ సెగ తగిలింది. బర్డ్‌ఫ్లూ వైరస్ దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ధోని ఆర్డర్ చేసిన రెండు వేల కడక్‌నాథ్ కోళ్లను, గ్రామప్రియ కోళ్ల ఆర్డర్‌ను రద్దు చేసుకున్నట్లు ధోని ఫాం హౌజ్ ప్రతినిధి పేర్కొన్నారు. ధోని కొనుగోలు చేసిన కోళ్లు రవాణాకు సిద్దమైన తరుణంలో బర్డ్‌ఫ్లూ బారిన పడ్డాయని కోళ్ల పంపకందారుడు డాక్టర్ విశ్వరాజన్ దృవీకరించారు. బర్ఢ్ ఫ్లూ ప్రభావం ముఖ్యంగా మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది.
మన దేశంలో కడక్‌నాథ్ చికెన్ పేరుతో పిలువబడే నల్లకోళ్ళను మధ్యప్రదేశ్‌లోని ఝబువా ప్రాంతం నుంచి గ్రామప్రియ కోళ్లను హైదరాబాద్ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ, రాంచీలోని తన 43 ఎకరాల ఫాం హౌజ్‌లో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నిలకొల్పాడు. అత్యధిక పోషక విలువలు కలిగిన నల్లకోళ్లు (కడక్‌నాథ్ కోళ్లు) అలాగే హైదరాబాద్ ప్రాంతంలో లభ్యమయ్యే గ్రామప్రియ కోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. ఈ రకం కోళ్ల మాంసం ఆరోగ్య సంరక్షణలోనూ, సంతానోత్పత్తిని పెంపొందించడంలోనూ సత్ఫలితాల్నిస్తున్నాయి.
దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా(బర్డ్‌ఫ్లూ) అనే వైరస్.. పక్షి జాతుల మనుగడను ప్రశ్నార్ధకంగా మారుస్తుంది. లక్షలాది పక్షుల ప్రాణాలను హరిస్తున్న ఈ వైరస్ దేశంలోని పది రాష్ట్రాలకు వ్యాపించింది. కడక్‌నాథ్ చికెన్ ధర కేజీకి 900 రూపాలయ నుంచి 1,200 రూపాలయ వరకు, గ్రామప్రియ చికెన్ కూడా ఇంచుమించు అంతే ధర పలుకుతుంది.