US Open Women Finals: సెరీనా ఆశలు గల్లంతు.. ఆండ్రిస్కూ సంచలనం
ఆమె వయసు 19 ఏళ్ళు. తన ప్రత్యర్థి మొదటి టైటిల్ గెలిచేటప్పటికి ఆమె ఇంకా పుట్టనేలేదు. అంతెందుకు.. ఈ టోర్నీ ముందు ఏ పెద్ద టోర్నీలోనూ ప్రీక్వార్టర్స్ కూ చేరలేదు. కానీ, ఏకంగా యూఎస్ ఓపెన్ టైటిల్ ని ఎగరేసుకుపోయింది. ఆ కెనడా యువతార ఆండ్రిస్కూ. ఆమె చేతిలో ఓటమి పాలైన టెన్నిస్ తార అమెరికాకు చెందినా సెరెనా.
మహిళా టెన్నిస్ లో అత్యధిక టైటిల్స్ గెలిచినా మార్గరెట్ కోర్ట్ రికార్డ్ సమానం చేయాలని ఆశించిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆశలు గల్లంతయ్యాయి. తనకన్నా చిన్నదైన కెనడా యువ తార బియాంక ఆండ్రిస్కూ చేతిలో వరుస సెట్లలో ఓటమి పాలై యూఎస్ ఓపెన్ టోర్నీని కోల్పోయింది సెరెనా. శనివారం అర్థరాత్రి దాటాకా జరిగిన ఈ పోటీలో సెరెనా పై 6-3, 7-5 తేడాతో గెలిచి రికార్డు సృష్టించింది ఆండ్రిస్కూ. కాగా, సెరెనా ఇప్పటివరకూ 23 టైటిల్స్ గెలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే మార్గరెట్ 24 పోటీల్లో గెలిచినా రికార్డును సమానం చేసేది సెరెనా.
ఆండ్రిస్కూ సంచలనం..
కెనడాకు చెందిన 19 ఏళ్ల ఆండ్రిస్కూ పేరు ఇప్పటి వరకూ టెన్నిస్ ప్రపంచంలో పెద్దగా తెలీదు. ఈ టోర్నీకి ముందు ఆమె ప్రపంచంలో 174వ ర్యాంక్ లో ఉంది. ఈ టోర్నీలో వరుసగా విజయాలు సాధించి ఫైనల్స్ ముందు తన ర్యాంకింగ్ మెరుగుపర్చుకుని 15కు చేరింది. ఇక ఆండ్రిస్కూ ఇంతకు ముందు ఎప్పుడూ గ్రాండ్ స్లాం పోటీల్లో ప్రీ క్వార్టర్స్ కి కూడా చేరలేదు. మొదటి సారే ఫైనల్స్ కు చేరి తనకన్నా ఎంతో మెరుగైన.. అనుభవం ఉన్న సెరెనా విలియమ్స్ పై విజయం అదీ వరుస సెట్లలో సాధించి రికార్డు సృష్టించింది. ఇంకో విషయం ఏమిటంటే సెరెనా తన మొదటి యూఎస్ టైటిల్ గెలిచే సమయానికి ఆండ్రిస్కూ జన్మించలేదు. సెరెనా 1999లో తొలి యూఎస్ టైటిల్ గెలిచింది. కాగా, 2000 జూన్ లో ఆండ్రిస్కూ పుట్టింది. అదేవిధంగా ఈ టోర్నీ గెలవడం ద్వారా చిన్న వయసులో ఒక గ్రాండ్ స్లాం టైటిల్ గెలిచిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.