Team India: ఒమిక్రాన్ పుట్టింటికి టీమిండియా.. క్రికెట్ వర్సెస్ ఓమిక్రాన్..!?
* ఒమిక్రాన్ వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బిసిసిఐ
Team India: కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ ప్రపంచమంతా చాపకింద నీరులా వ్యాపిస్తున్నా టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటనకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకి వెళ్లడం ఖాయమని, కాని ముందుగా అనుకున్న విధంగా డిసెంబర్ 17 నుంచి కాకుండా డిసెంబర్ 26 నుంచి సిరీస్ మొదలవుతుందని ప్రకటించింది. ఇక ఈ పర్యటనలో ముందుగా షెడ్యూల్ చేసిన టీ20 సిరీస్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్టుగా కోల్‌కతా వేదికగా ఇటీవల జరిగిన బీసీసీఐ వార్షిక జనరల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా రివైజ్డ్ షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది.
మూడు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్ సెంచూరియన్ వేదికగా డిసెంబరు 26న మొదలు కానుంది. 2022 జనవరి 3-7 వరకు జోహేన్స్ బర్గ్ లో రెండవ టెస్టు, జనవరి 11-15 మధ్య కేప్‌టౌన్‌లో మూడో టెస్టు జరుగనున్నాయి. జనవరి 19, 21, 23 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. పార్ల్ వేదికగా మొదటి రెండు వన్డేలు జరగనుండగా, కేప్‌టౌన్ లో మూడో వన్డే జరగనుంది. ఇప్పటివరకు ఒక్క టెస్ట్ సిరీస్ గెలువని ఏకైక దేశమైన దక్షిణాఫ్రికాలో ఈ పర్యటనలోనైనా కోహ్లిసేన విజయం సాధించి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే వరుసగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా దక్షిణాఫ్రికా పర్యటనకి పచ్చజెండా ఊపడంపై పలువురు క్రీడా ప్రముఖులు బీసీసీఐ నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు.