IND vs SL: ఆసియా కప్‌లో భారత బౌలర్ల హవా.. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసిన సిరాజ్..
IND vs SL: కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన సిరాజ్
IND vs SL: ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. కీలక పోరులో కేవలం 40 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. 6 వికెట్లతో లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు సిరాజ్.
ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే వికెట్ల పతనం ప్రారంభం కాగా.. ఆ తర్వాత శ్రీలంక బ్యాట్స్‌మెన్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. వచ్చిన బ్యాట్స్‌మెన్‌ను వచ్చినట్లే వెనక్కి పంపాడు సిరాజ్. కుశాల్ మెండిస్ మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా సింగిల్ డిజిట్ దాటలేదు. కుశాల్ పెరీరా, సమర విక్రమ, శనక, అసలంక డకౌట్ అయ్యారు. క్రీజులో కాస్త కుదురుకున్నట్లే కనిపించిన కుశాల్ మెండిస్ కూడా 17 పరుగులు చేసిన తర్వాత అవుటయ్యాడు.
మొత్తానికి తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సిరాజ్ దండయాత్రతో లంకేయులు నిలవలేకపోయారు. ఇన్నింగ్స్‌లో తను వేసిన 16 బంతులకే ఆరు వికెట్లు తీసిన సిరాజ్.. కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఆసియా కప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి.. శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ రికార్డును సమం చేశాడు.