Raw Mango vs Ripe Mango: మామిడి కాయలా లేక మామిడి పండ్లా... ఆరోగ్యానికి ఏవి మంచివి?

Raw Mango vs Ripe Mango: వేసవి వచ్చిందంటే ఒకవైపు మామిడి పండ్లు, మరోవైపు మామిడి కాయలతో మార్కెట్‌ కళకళలాడుతుంది.

Update: 2024-05-18 11:59 GMT

Raw mango vs Ripe mango: మామిడి కాయలా లేక మామిడి పండ్లా... ఆరోగ్యానికి ఏవి మంచివి?

Raw mango vs Ripe mango: వేసవి వచ్చిందంటే ఒకవైపు మామిడి పండ్లు, మరోవైపు మామిడి కాయలతో మార్కెట్‌ కళకళలాడుతుంది. నిజానికి చాలా మంది వీటి కోసమే వేసవి ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు.

పండ్లలో రాజు అంటే మామిడి పేరే చాలా మంది చెబుతారు. దాదాపు అన్ని రకాల వంటల్లోనూ కొందరు మామిడి కాయలని కలుపుతుంటారు. అలానే పండ్లను కూడా రసం, పాయాసం, తాండ్రి ఇలా చాలా రకాలుగా తీసుకుంటారు.

ఇంతకీ మన ఆరోగ్యానికి మామిడి కాయలు మంచివా లేదా పళ్లా? వేటిలో పోషకాలు ఎలా ఉంటాయి?

మామిడి కాయల మంచితనం...

పచ్చి మామిడి కాయలను ఎక్కువగా ఊరగాయలు, సాలడ్‌లు, చట్నీల్లో ఉపయోగిస్తుంటారు. కూరల్లో కాస్త పుల్లదనం కోసమూ వీటిని కలుపుతుంటారు.

వీటిలో విటమిన్-సీ పుష్కలంగా లభిస్తుంది. రోగ నిరోధక శక్తికి పెంచడంలో ఈ విటమిన్ చాలా ముఖ్యం. అంతేకాదు చర్మం ఆరోగ్యంగా కనిపించడంలోనూ ఇది సాయం చేస్తుంది. మన శరీరం ఐరన్‌ను తీసుకోవడంలోనూ ఇది తోడ్పడుతుంది.

క్వెర్‌సెటిన్, ఐసోక్వెర్‌సెటిన్, ఫిసెటిన్, గాలిక్ యాసిడ్ లాంటి యాంటీ-ఆక్సిడెంట్లు కూడా పచ్చి మామిడి కాయల్లో ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్‌ఫ్లమేషన్‌ నుంచి శరీరాన్ని కాపాడుతాయి.

పచ్చి మామిడిలో అమైలేసెస్‌గా పిలిచే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి అజీర్తి సమస్యలను తగ్గిస్తాయి.

పచ్చి మామిడి కాయల్లోని బయో-యాక్టివ్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలోనూ సాయపడతాయని, ఫలితంగా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.

మామిడి పండ్లు చేసే మేలు...

పచ్చి మామిడిలానే పండ్లలోనూ విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. దీనికి అదనంగా విటమిన్-ఏ, విటమిడ్-ఈ, పొటాషియం, ఫోలేట్ లాంటి విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.

మామిడి పండ్లలోనూ విటమిన్-సీ స్థాయిలు ఎక్కువగా ఉండటంతో ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్లు, వ్యాధులపై మన శరీరం మెరుగ్గా పోరాడుతుంది.

మామిడి పండ్లలో బీటా-కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది మన శరీరంలో విటమిన్-ఏగా మారుతుంది. వయసు పైబడటంతో వచ్చే కంటి సమస్యలకు విటమిన్-ఏ చక్కటి పరిష్కారంలా పనిచేస్తుంది.

అంతేకాదు, వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఫలితంగా మన చర్మం బిగుతుగా, యవ్వనంగా ఉంటుంది. యూవీ రేడియేషన్, ఇతర కాలుష్యాల నుంచి కూడా ఇది రక్షణ కల్పిస్తుంది.

తేడా ఏంటి?

పచ్చి మామిడి లేదా పండ్లు.. ఈ రెండింటికీ దేని ప్రత్యేకతలు దానివే. దీన్ని ఒకదానితో మరొకటి పోల్చడం కొంచెం కష్టమే.

అయితే, ఇండియన్ జర్నల్ రసాయన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో పచ్చి మామిడిలో నీరు 23.5 శాతం వరకు ఉండగా, అదే పండ్లలో అయితే, ఇది 82.9 శాతం వరకు ఉంటుందని తేలింది.

అంతేకాదు, పండ్లతో పోల్చినప్పుడు కాయల్లో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే షుగర్, ఫ్యాట్ స్థాయిలు తక్కువగా ఉంటాయి.

పండ్లతో పోల్చినప్పుడు పచ్చి మామిడిలో విటమిన్-సీ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే, పండ్లలో విటమిన్-ఏ ఎక్కువగా ఉంటుంది.

ఏది ఆరోగ్యానికి మంచిది?

ఈ రెండింటిలో ఏది మంచిదో చెప్పడం చాలా కష్టమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన అభిరుచులు, ఆరోగ్యం, శరీరానికి కావాల్సిన పోషకాల ఆధారంగా వీటిని ఎంచుకోవాల్సి ఉంటుందని విజయవాడకు చెందిన న్యూట్రీషనిస్టు బీ రోహిణి చెప్పారు.

‘‘ఉదాహరణకు మీకు రోగ నిరోధక సమస్యలు ఉన్నా లేదా తరచూ అనారోగ్యం చేస్తున్నా పచ్చి మామిడి తింటే మంచిది. ఎందుకంటే పండ్లతో పోలిస్తే, వీటిలో విటమిన్-సీ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి’’ అని ఆమె చెప్పారు.

అయితే, వయసు పైబడిన ఛాయలు తగ్గించుకోవాలని అనుకుంటే పండ్లను ఎంచుకుంటే మేలని చెప్పారు. ‘‘ఎందుకంటే పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే, కేవలం ఈ పండ్లను తీసుకుంటే వయసు పైబడిన ఛాయలు తగ్గిపోతాయని అనుకోకూడదు. ఇవి కేవలం కొంతవరకు పనిచేస్తాయి అంతే’’ అని చెప్పారు.

మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యలతో బాధపడేవారికి పచ్చి మామిడి మేలు చేస్తుందని ఆమె వివరించారు. అయితే, మధుమేహంతో బాధపడేవారు ఈ పండ్లు మరీ ఎక్కువగా తినడం మంచిదికాదని ఆమె అన్నారు.

‘‘మామిడి పండ్ల గ్లైసిమిక్ ఇండెక్స్ 56 వరకూ ఉంటుంది. దీన్ని మోడరేట్‌గా చెప్పుకోవచ్చు. కాబట్టి రోజుకు వీటిని వంద గ్రాములకు మించి తీసుకోకూడదు. వాస్తవానికి మధుమేహులు పండ్లకు బదులుగా పచ్చి కాయలను తింటే మంచిది’’ అని ఆమె సూచించారు.

రోజుకు ఎన్ని తీసుకోవచ్చు?

ఆరోగ్యంగా ఉండేవారు రోజుకు ఎన్ని మామిడి పండ్లు తీసుకోవచ్చు? ఈ ప్రశ్నకు సమాధానంగా రోజుకు ఒక మోస్తరు పరిమాణంలోని రెండు మామిడి పండ్లు తీసుకోవచ్చని డాక్టర్ సాయిబాబా నాయుడు చెప్పారు.

‘‘మొత్తంగా ఇవి 350 గ్రాముల లోపే ఉంటే మంచిది. 100 గ్రాముల మామిడిలో 60 క్యాలరీల వరకు ఉంటాయి. ఒక మోస్తరు పరిమాణంలోని మామిడి పండులో 200 వరకు క్యాలరీలు ఉంటాయి. కాబట్టి మనం 350 గ్రాముల లోపు తీసుకుంటే కావాల్సిన పోషకాలు అందుతాయి. అలానే మన క్యాలరీలు కూడా అదుపులోనే ఉంటాయి’’ అని ఆయన చెప్పారు.

ఏ ఆహార పదార్థమైనా పరిమితికి మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని, మామిడి కూడా దీనికేమీ మినహాయింపుకాదని ఆయన అన్నారు.

Tags:    

Similar News