Live Stock Online Sales: గొర్రెలు, మేకలకు విస్తరించిన ఆన్ లైన్ అమ్మకాలు
Live Stock Online Sales: ఆన్ లైన్ అమ్మకాలు.. ప్రపంచంలో ఇప్పుడు ఇదే పెద్ద వ్యాపారం.
Live Stock Online Sales: ఆన్ లైన్ అమ్మకాలు.. ప్రపంచంలో ఇప్పుడు ఇదే పెద్ద వ్యాపారం. గుండు సూది నుంచి టీవీలు.. కంప్యూటర్లు దాకా.. ఆవపిండి నుంచి ఆనపకాయ దాకా ఆన్ లైన్ లో అమ్మకాలు.. కొనుగోళ్ళు విపరీతంగా జరిగిపోతున్నాయి. ఒక్క ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు కావాల్సిన వస్తువు మన గుమ్మం ముందు ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ జాబితాలో లైవ్ స్టాక్ అంటే బతికున్న జంతువులు లేవు. ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఆ ముచ్చటా తీరిపోతోంది. అవును.. ఆన్ లైన్ లో మీరు ఆర్డర్ చేస్తే చాలు.. గొర్రెలు.. బర్రెలు కూడా మీ ఇంటి ముందు ప్రత్యక్షం అయిపోతాయి. నమ్మశాక్యంగా లేదా.. అయితే ఈ వెబ్సైట్ ను చూడండి. http://netlivestock.com/ పూర్తి వివరాలు మీకోసం..
కరోనా పుణ్యమాని గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులను చూడాల్సి వస్తోంది. ఎన్నడూ వినని వింతలను వినాల్సి వస్తోంది. దీనిలో భాగంగానే ఇంతవరకు వస్తువుల వరకే పరిమితమైన ఆన్ లైన్ అమ్మకాలు ప్రాణాలతో ఉన్న వాటికి విస్తరించాయి. తాజాగా ఈ నెల 31న బక్రీద్ నేపథ్యంలో మార్కెట్ కు వెళ్లి వినియోగదారులు ఇబ్బందులు పడకుండా తాజాగా ఆన్ లైన్ అమ్మకాలు చేసేందుకు శ్రీకారం చుట్టింది.
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బక్రీద్ పండుగ కోసం.. ఆన్‌లైన్‌లో మేకలు, గొర్రెలు విక్రయించేందుకు netlivestock.com ను ప్రారంభించారు. అలీఘడ్ ముస్లిమ్ యూనివర్శిటీ అలూమ్నీ సభ్యులు దీనికి శ్రీకారం చుట్టారు. రైతులు, వినియోగదారులను కలిపుతూ మేకలు, గొర్రెలను ఆన్‌లైన్‌లో విక్రయానికి తెర తీసింది ఈ వెబ్ సైట్.
కోవిద్-19 సంక్షోభ సమయంలో మార్కెట్‌కు వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో రైతులకు, వినియోగదారులను అనుసంధానం చేసేందుకు నెట్ లైవ్ స్టాక్ డాట్ కాంను ప్రారంభించామని పీజీ విద్యార్థి ఖలీద్ రజా చెప్పారు. ఆన్ లైన్ లో కొన్న మేకలు, గొర్రెలను కొన్న వారి ఇంటి ముంగిట డెలివరీ ఇచ్చేలా సహాయకులను నియమించామని ఖలీద్ చెప్పారు. బక్రీద్ పండుగ కోసం ఆన్ లైన్‌లో మేకలు, గొర్రెల విక్రయాలను జంతుప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు.