
గడ్డకట్టే చలిలో రాత్రంతా విమానం రెక్కపైనే గడిపారు.. చివరికి..
Plane crashed into icy Alaska lake: సైట్ సీయింగ్ కోసం చిన్న విమానంలో ఇద్దరు చిన్నారులను తీసుకుని వెళ్లిన ఒక పైలట్‌కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. పైపర్ పీఏ-12 సూపర్ క్రూయిజర్ విమానం అలస్కాలోని టుస్టుమెనా సరస్సులో కూలిపోయింది. అలస్కాలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ది ఇండిపెండెంట్ వార్తా కథనం ప్రచురించింది.
అలస్కాలోని ఆ ప్రాంతం అంతా మంచు కొండలతో నిండి ఉంటుంది. అలాంటి ప్రాంతంలో సైట్ సీయింగ్ కోసం వెళ్లిన వారి విమానం మంచు సరస్సులో కూలిపోయింది. విమానం మొత్తం సరస్సులో మునిగిపోయింది. విమానం టెయిల్, రెక్కలు మాత్రమే బయటికి కనిపిస్తున్నాయి. విమానంలో ప్రాణాలతోనే ఉన్న ముగ్గురు ప్రయాణికులు ఎలాగోలా కష్టపడి ఆ విమానం రెక్కపైకి చేరుకున్నారు. ఫోటోలో ఆ చిన్న విమానానికి కొద్ది దూరంలోనే సరస్సులోని నీరు కూడా పూర్తిగా గడ్డ కట్టి ఉండటం చూడొచ్చు.
అప్పటికే చీకటి పడిపోయింది. దాంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడ్డకట్టే మంచులోనే విమానం రెక్కపై గడిపారు. ఎవరికైనా సమాచారం అందించాలన్నా వారి వద్ద ఏమీ మిగలలేదు. ఫోన్‌తో పాటు అన్ని సమాచార సాధనాలు సరస్సులో మునిగిపోయాయి. దీంతో ఎవరైనా అటువైపు వస్తారేమోననే ఆశతో పైకి చూస్తూ కాలం వెళ్లదీశారు.
మరునాడు ఉదయం వారిని గమనించిన ఒక వ్యక్తి ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. వారిని వెదుక్కుంటూ టెర్రీ గోడ్స్ అనే పైలట్ విమానంతో బయల్దేరారు. సరస్సులో ఒక చోట విమానం శిథిలాలు కనిపించడంతో తన విమానాన్ని కొంత కిందకు దింపారు. తీక్షణంగా చూస్తే అక్కడ విమానం రెక్కపై ముగ్గురు తనవైపే చేతులు ఊపడం కనిపించింది.

అలస్కా నేషనల్ గార్డ్స్, అలస్కా స్టేట్ ట్రూపర్స్ రెస్క్యూ బృందాల సహాయంతో వారిని కాపాడి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ముగ్గురు సురక్షితంగానే ఉన్నారు. " ఆ సరస్సు చుట్టూ కొండలే, పైగా తక్కువ ఎత్తులో మేఘాలు ఏర్పడుతుంటాయి. అలాంటి చోట వారిని గుర్తించడం కూడా కష్టమే. అయినా వారిని గుర్తించామంటే నిజంగా ఇది పెద్ద మిరాకిల్ అనిపిస్తోంది" అని పైలట్ టెర్రీ గోడ్స్ తెలిపారు. భూమ్మీద నూకలు బాకీ ఉంటే, బతకాలని రాసి పెట్టి ఉంటే ఎవరైనా, ఎంత పెద్ద గండం నుండి అయినా బతికి బయటపడుతారని పెద్దలు చెబుతుంటారు కదా... ఈ ముగ్గురి విషయం కూడా అదే జరిగింది.