No Confidence Motion: నేడు అవిశ్వాస తీర్మానంపై జరగనున్న ఓటింగ్

No Confidence Motion: మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే కూటమిలో 332 మంది సభ్యులు

Update: 2023-08-10 04:05 GMT

No Confidence Motion: నేడు అవిశ్వాస తీర్మానంపై జరగనున్న ఓటింగ్

No Confidence Motion:  లోక్‌సభలో విపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ జరగనుంది. రెండు రోజులుగా తీర్మానంపై చర్చ జరుగుతుండగా.. ఇవాళ ప్రధాని మోడీ సమాధానం ఇవ్వనున్నారు. అనంతరం స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించనున్నారు. లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543 కాగా.. అందులో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో స్పీకర్‌తో కలిపి ప్రస్తుతం 538 మంది ఎంపీలున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 270 మంది ఎంపీల ఓట్లు అవసరం.

ప్రస్తుతం లోక్‌సభలో అవిశ్వాసం ఎదుర్కొంటున్న బీజేపీకి సొంతంగా 303 మంది ఎంపీలున్నారు. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే కూటమిలో 332 మంది సభ్యల బలం ఉంది. ఇక విపక్ష ఇండియా కూటమిలో 142 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. తటస్థంగా 64 మంది ఎంపీలున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమే. అయితే మణిపూర్‌పై సైలెంట్‌గా ఉన్న ప్రధానిని మాట్లాడించేందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని తెలిపారు కాంగ్రెస్ ఎంపీలు. దీంతో ఇవాళ మణిపూర్‌‌పై ప్రధాని చేసే ప్రసంగం ఆసక్తికరంగా మారింది.

రెండు రోజులుగా అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చ వాడివేడిగా సాగుతోంది. చర్చ ప్రారంభంలోనే కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌ స్పీచ్‌ సభలో హీట్ పెంచింది. ఇక నిన్న రాహుల్ ప్రసంగంతో ఆ హీట్ డబుల్ అయింది. మణిపూర్‌లో మంటలు పెట్టారంటూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు రాహుల్. భరతమాతను హత్య చేశారంటూ హాట్‌ కామెంట్స్ చేశారు. దీంతో లోక్‌సభలో మణిపూర్‌ అంశం వాడివేడి చర్చకు దారి తీసింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కూడా దీటుగా బదులిచ్చింది. భరతమాతను హత్య చేశారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి స్మృతి ఇరానీ. ఆ వ్యాఖ్యలకు బల్లలు చరుస్తూ విపక్ష ఎంపీలు మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు.

అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో విపక్ష కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. కలహాలమారి కాంగ్రెస్ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో మణిపూర్‌లో ఏడాదిన్నర పాటు అల్లర్లు జరిగినా.. కేవలం సహాయ మంత్రితో ప్రకటన చేసి వదిలేసిందన్నారు. మన్మోహన్ హయాంలోనూ మణిపూర్‌లో అల్లర్లు జరిగితే సభలో చర్చించలేదని.. మేం మణిపూర్‌ అల్లర్లపై చర్చకు సిద్ధమని చెబుతున్నా కావాలని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం ప్రభుత్వంపై కాదని.. విపక్ష ఇండియా కూటమిపైనే అవిశ్వాసం ఉందన్నారు అమిత్ షా. రెండున్నర గంటల సుదీర్ఘ ప్రసంగం చేసిన షా.. మణిపూర్‌లో శాంతి కోసం రెండు వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇవాళ ప్రధాని మాట్లాడనుండటంతో.. మణిపూర్‌పై మోడీ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ప్రధాని ప్రసంగం అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు స్పీకర్‌. 

Tags:    

Similar News