TOP 6 News @ 6PM: టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరిన తిరువూరు పంచాయితీ: మరో 5 ముఖ్యాంశాలు

1. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరో కేసు
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై ఆ దేశంలో మరో కేసు నమోదైంది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కుట్ర పన్నుతున్నారనే అభియోగంపై హసీనాతో పాటు 72 మందిపై కేసులు నమోదయ్యాయి. 2024 డిసెంబర్ 19న షేక్ హసీనా ఆన్ లైన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఉందని అధికారులు చెబుతున్నారు. జాయ్ బంగ్లా బ్రిగేడ్ పేరుతో వ్యవస్థను ఏర్పాటు చేసి హసీనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కుట్ర చేశారని సీఐడీ ఆమెపై కేసు నమోదు చేశారు.
2. ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ కేసు: కోర్టుకు సీబీఐ కీలక నివేదిక
ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో కోర్టుకు సీబీఐ కీలక రిపోర్టు అందించింది. మృతురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. సంఘటన స్థలంలో సేకరించిన డీఏన్ఏ నమూనాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్టు కోర్టుకు తెలిపారు. జూనియర్ డాక్టర్ పై గ్యాంగ్ రేప్ జరగలేదని డాక్టర్ల బృందం తేల్చిందని సీబీఐ తెలిపింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్ లో జూనియర్ డాక్టర్ హత్యకు గురైంది.ఈ కేసులో సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించింది.
3. హైదరాబాద్ గుడిమల్కాపుర్ లో కాల్పులు
హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో కాల్పులు జరిగాయి. కింగ్స్ ప్యాలె్ లో ఆనం మీర్జా ఎక్స్ పో జరుగుతోంది. ప్రదర్శనలో ఇద్దరు దుకాణదారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటన కాల్పులకు కారణమైంది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనస్థలానికి చేరుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
4. పేదల సంక్షేమం కోసం పాటుపడింది టీడీపీ:చంద్రబాబు
పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ నాంది పలికారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశమని ఆయన అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలను మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీకి మనమంతా వారసులం మాత్రమేనని... పెత్తందారులం కాదన్నారు. తాను టీమ్ లీడర్ ను మాత్రమేనని చంద్రబాబు తెలిపారు. పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నించినవారే కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు గుర్తు చేశారు.
5. నాకు ఏమైనా జరిగితే వివేకా హత్య కేసు నిందితులదే బాధ్యత: సునీల్ యాదవ్
తనకు ఏదైనా జరిగితే వైఎస్ఆర్‌సీపీ నాయకులు, వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులదే బాధ్యత అని సునీల్ యాదవ్ ఆరోపించారు. హత్య సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎందుకు ఉలికిపాటని ఆయన ప్రశ్నించారు. ఈ సినిమాలో కొందరి పాత్రలు ఎందుకు చూపలేదని ఆయన అడిగారు. ఈ సినిమాను వైఎస్ఆర్‌సీపీ నాయకులే తీశారనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. తాను కోట్లు సంపాదించినట్టు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ ఆరోపణలను నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు.
6. టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరిన తిరువూరు పంచాయితీ
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి తిరువూరు పంచాయితీ చేరుకుంది. తిరువూరుకు కొలికపూడి వద్దు అంటూ పార్టీ కార్యాలయంలో నినాదాలు చేశారు. తిరువూరు నుంచి రమేశ్ రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ కార్యకర్తలను సముదాయించారు. రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. లేకపోతే తాను రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ డెడ్ లైన్ ముగిసిన తర్వాత రమేశ్ రెడ్డి నేతృత్వంలో టీడీపీ క్యాడర్ మంగళగిరికి చేరుకున్నారు.