Tamil Nadu: తమిళనాడులో కొనసాగుతున్న భారీ వర్షాలు

* పుదుచ్చేరి, విల్లుపురం, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు * రేపు, ఎల్లుండి తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Update: 2021-11-09 04:42 GMT

తమిళనాడులో కొనసాగుతున్న భారీ వర్షాలు(ఫైల్ ఫోటో)

Tamil Nadu: చెన్నై సహా ఉత్తర తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతోంది. ఇంకా ముంపులోనే వందలాది గ్రామాలు మగ్గుతున్నాయి. చెన్నై శివారులోని పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేని వర్షం కారణంగా కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.

పుదుచ్చేరి, విల్లుపురం, కదలూరు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మోటూరు డ్యామ్ నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.

ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అస్తవ్యస్తమైన చెన్నైకి మరో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు తమిళనాడులో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.

వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి కమ్యూనిటి కిచెన్స్ ద్వారా ఆహార పొట్లాలు సరఫరా చేస్తున్నారు. చెంబరబక్కం చెరువు నిండుకుండలా మారింది. 85.4 అడుగులు నీటిమట్టం కాగా ప్రస్తుతం 82.35 అడుగుల నీటిమట్టంతో నిండుకుండను తలపిస్తోంది. 2015లో ఈ చెరువు ఉప్పొంగి ప్రవహించడం వల్లే చెన్నైలో వరదలు పోటెత్తాయి.

చెన్నైలోని ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. చెన్నై పరిసరాల్లోని 3 రిజర్వాయర్ల నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరి కాలనీలన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కార్పొరేషన్‌ అధికారులు మోటార్లతో నీటిని తోడుతున్నారు. 

Tags:    

Similar News