Maharashtra: అమరావతిలో వారం రోజుల పాటు లాక్‌డౌన్
Maharashtra: పుణెలో ఫిబ్రవరి 28వరకు విద్యాసంస్థలు మూతపడనున్నాయి.
Maharashtra:మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం వైరస్ తీవ్రత ఉన్నచోట్ల ఆంక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతితో పాటు పలు జిల్లాల్లో వారంపాటు పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 22 రాత్రి నుంచి మార్చి 1వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో వీకెండ్ లాక్‌డౌన్ అమల్లో ఉండగా, ఇప్పుడు పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 6281 పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో 27శాతం కేసులు కేవలం ముంబయి, అమరావతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అమరావతి ప్రాంతంలో ఆంక్షలు విధించారు. అమరావతి జిల్లాలో వారంపాటు పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉంటుందని మంత్రి యశోమతి ఠాకూర్ వెల్లడించారు. ఈ సమయంలో అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి డివిజన్‌లోని అకోలా, యావత్‌మల్, బుల్ధానా, వాషిం నాలుగు జిల్లాల్లోనూ పలు ఆంక్షలు కొనసాగుతాయని.. ప్రజలు నిబంధనలు పాటించకుంటే లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం, వైరస్ కట్టడి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించింది. పరిస్థితి తీవ్రతను బట్టి లాక్‌డౌన్, కర్ఫ్యూలపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఇందులో భాగంగా ఇప్పటికే పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు.
పుణెలో గడిచిన రెండు, మూడు రోజులుగా నిత్యం ఐదువందల పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు రాత్రిపూట 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం రాత్రి నుంచి ఈ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఫిబ్రవరి 28వరకు పాఠశాలలు, కాలేజీలు కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు.