Maharashtra: 26 రోజులుగా ఇద్దరి ఆధ్వర్యంలో మహా ప్రభుత్వం
*మంత్రి పదవులు దక్కకపోవడంతో...షిండే వర్గం ఎమ్మెల్యేల్లో డైలమా
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గంలో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే వర్గం కేసుల మీద కేసులు వేస్తుండడంతో మంత్రి వర్గ విస్తరణ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద పారిశ్రామిక రాష్ట్రం మహారాష్ట్రను 26 రోజులుగా షిండే, ఫడ్నవీస్ నడిపిస్తున్నారు. ఎన్నో ఆశలతో మంత్రి పదవులు వస్తాయని ఆశించి షిండే వెంట నడిచిన సేన రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పుడు డైలామాలో పడిపోయారు. బీజేపీకే అధిక మంత్రి పదవులు కేటాయిస్తుండడంతో సేన రెబల్ ఎమ్మెల్యేలు అసహనానికి గురవుతున్నారట గతంలో పర్యావరణానికి ముప్పుని ఉద్దవ్ థాక్రే రద్దు చేసిన ప్రాజెక్టుకు షిండే అనుమతులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మంత్రి పదవులు వస్తాయన్న ఆశతో సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేతో 40 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. దీంతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం పడగొట్టారు. ఆ తరువాత ఏక్‌నాథ్ షిండే ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటయ్యింది. షిండే ముఖ్యమంత్రిగా, ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల రోజులకు చేరువయ్యింది. అయినా ఇప్పటివరకు మంత్రి వర్గ విస్తరణ చేపట్టలేదు. ఇప్పటికే ఏక్‌నాథ్ షిండే వర్గానికి 13 మందికి, బీజేపీ ఎమ్మెల్యేలకు 25 మందికి మంత్రి పదువులు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతున్నాయో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. 40 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 13 మందికే మంత్రి పదవులు అనేసరికి పలువురిలో అసంతృప్తి నెలకొన్నది.
బీజేపీ-శివసేన కూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా పని చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి పదవికి చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీలోనూ తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ విషయం ఇటీవల ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కూడా వెల్లడించారు. తమకు ఇష్టం లేకపోయినా అధిష్ఠానం సూచన మేరకు అలా చేయాల్సి వచ్చిందన్నారు. అయితే మహారాష్ట్రలో ప్రధాన శక్తిగా ఎదుగుతున్న ఫడ్నవీస్‌పై కేంద్ర బీజేపీలో ఆందోళన చెందినట్టు తెలుస్తోంది. ఫడ్నవీస్‌కు చెక్ పెట్టేందుకే అధిష్ఠానం ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టినట్టు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. పైకి మాత్రం షిండే ప్రభుత్వానికి స్థిరత్వాన్ని ఇచ్చేందుకే అని పైకి చెప్పినట్టు సమాచారం.
ఇప్పటివరకు మహారాష్ట్రలో క్యాబినెట్ ఏర్పాటు చేయలేదు. పైగా ఇటీవల కార్ షెడ్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్టుతో ముంబైలోని ఆరే అటవీ ప్రాంతంలోని చెట్లు భారీగా కూలనున్నాయి. కార్‌షెడ్ ప్రాజెక్టును ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు మంత్రివర్గ పదవుల కోసం నిత్యం అమిత్‌షా, నడ్డాను ప్రసన్నం చేసుకునేందుకు పలువురు బీజేపీ, షిండే వర్గం ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి హామీ లభించలేదు. పబ్లిక్ వర్క్స్, హోమ్, ఫైనాన్స్ వంటి కీలకమైన శాఖలను పలువురు ఆశిస్తున్నారు. అయితే ఆశావహులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. షిండేకు, ఫడ్నవీస్‌కు పదవులు దక్కాయని తమ పరిస్థితి ఏమిటని వారు డైలమాలో పడిపోయారు.
ఫిర్యాయింపులు, శివసేన పార్టీపై నియంత్రణ విషయంలో ఇటు షిండే అటు ఉద్దవ్ వర్గాలు పోరాడుతున్నాయి. ప్రారంభంలోనే 16 మంది ఎమ్మెల్యేలపై ఉద్దవ్ అనర్హత వేటేశారు. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తోంది. మరోవైపు పార్టీపై నియంత్రణ కోరుతూ షిండే వర్గం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతో ఇరువర్గాలు బలాన్ని నిరూపించుకోవాలంటూ ఈసీ ఆదేశించింది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం షిండే వర్గానికే అధిక బలం ఉంది. దీంతో ఈ విషయం పైనా ఉద్దవ్ వర్గం మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోనంతవరకు మంత్రి వర్గం విస్తరించే అవకాశం లేదు. మరోవైపు షిండే వర్గానికి చెందిన కేవలం 8 మందికి మాత్రమే మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని తాజాగా తెలుస్తోంది. దీంతో మిగతా రెబల్ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది.
45 కోట్ల వార్షిక బడ్జెట్‌తో దేశంలోనే అత్యంత ధినక కార్పొరేషన్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్-బీఎంసీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. అయితే మంత్రి వర్గాన్ని విస్తరించకుండానే బీఎంసీ ఎన్నికల్లో గెలవాలని షిండే వర్గం కలలు కంటోందని థాక్రే వర్గం విమర్శలు గుప్పిస్తోంది.