Election Commission Pressmeet: ఆ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు
హర్యానా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్
Assembly Elections 2024 Schedule Full Details: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం హర్యానా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది అని తొలుత వార్తలు వచ్చినప్పటికీ.. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల నిర్వహణతో పాటు రాబోయే పండల సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని భద్రతా బలగాల నిర్వహణలో సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. " 2024 లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా యువత నుండి మొదలుకుని వృద్ధుల వరకు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితంగా ప్రపంచంలోనే భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్న ఎన్నికలుగా 2024 లోక్ సభ ఎన్నికలు రికార్డు సొంతం చేసుకున్నాయి " అని గుర్తుచేశారు.
ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఎంతో చైతన్యం చూపించారని.. ఈసారి వారు హింసను పక్కనపెట్టి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకే మొగ్గు చూపించారు అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు 3 విడతలుగా జరగనున్నాయి. సెప్టెంబర్ 18న తొలి విడత ఎన్నికలు నిర్వహించనుండగా, సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న చివరి విడత ఎన్నికలు నిర్వహిస్తాం అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 20 నాటికి జమ్మూకశ్మీర్‌లో ఎలక్టోరల్ రోల్స్ తుది ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు తెలిపారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల సంఖ్య: 11838
పోలింగ్ జరిగే ప్రాంతాలు: 9,169
ఓటర్ల సంఖ్య: 87.09 లక్షలు
మహిళా ఓటర్ల సంఖ్య: 42.6 లక్షలు
అసెంబ్లీ స్థానాల సంఖ్య: ౯౦
అక్టోబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీల విషయానికొస్తే... అక్టోబర్ 1న ఒకే విడతలో ఓటింగ్ చేపట్టి, అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడించనున్నట్టు ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
2014 లో ఎన్నికలు తరువాత జమ్మూకశ్మీర్‌లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. గత పదేళ్ల కాలంలో జమ్మూకశ్మీర్‌లో అనేక రాజకీయ పరిణామాలు, ఎన్నో మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై దాఖలైన ఓ పిటిషన్ పై గతేడాది డిసెంబర్ నెలలో సుప్రీం కోర్టు స్పందిస్తూ.. 2024 సెప్టెంబర్ 30 నాటికి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 14న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో భేటీ అయిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఇవాళ ఈ ఎన్నికల షెడ్యూల్‌ని విడుదల చేసింది.
పదేళ్ల తరువాత తాజాగా జరగబోయే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు భారీ ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు ప్రత్యేక భద్రత కల్పించాల్సిందిగా రాజకీయ పార్టీల నుండి విజ్ఞప్తులు అందాయని, తాము అందుకు అంగీకరించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
హర్యానా అసెంబ్లీలో ప్రస్తుత ప్రభుత్వానికి నవంబర్ 3వ తేదీ వరకు గడువు ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీలో సభ్యుల పదవీ కాలం నవంబర్ 26న ముగియనుంది. ఇక జార్ఖండ్ విషయానికొస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం 2015 జనవరి వరకు కొనసాగే వీలుంది.