శివసేన నేత సంజయ్ రౌత్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ
Sanjay Raut: ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సంజయ్ నివాసంలో ED అధికారులు సోదాలు
Sanjay Raut: శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్‌ను ED అధికారులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సంజయ్ నివాసంలో ED అధికారులు సోదాలు నిర్వహించారు. పాత్రచాల్ భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సంజయ్ రౌత్‌ను సుమారు 8 గంటలపాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సంజయ్‌కు సంఘీభావంగా ఆయన నివాసానికి శివసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముందస్తుగా ED అధికారులు CISF సిబ్బందితోపాటు భారీ భద్రత మధ్య సోదాలు నిర్వహించారు. ఈ నెల 1న కూడా సంజయ్‌ను ED అధికారులు 10 గంటలపాటు విచారించారు. ఆ తర్వాత మరో రెండు సార్లు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు.
కానీ సంజయ్ ED విచారణకు హాజరు కాలేదు. పాత్రచాల్ కుంభకోణంతో సంజయ్ భార్య వర్షా రౌత్ సహా మరికొందరు ఆయన సన్నిహితులకు సంబంధం ఉందన్నది ప్రధాన అభియోగం. ఈ క్రమంలో ఏప్రిల్‌లో వర్షా రౌత్‌కు చెందిన 11 కోట్ల 15 లక్షు విలువ చేసే ఆస్తులను ED అధికారులు అటాచ్ చేశారు. సంజయ్ సన్నిహితుల ఆస్తులను కూడా జప్తు చేశారు. ఒక వెయ్యి 34 కోట్ల రూపాయల పాత్రచాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే సంజయ్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌ను ED అదుపులోకి తీసుకుంది. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులు చేస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. తాను ఎటువంటి తప్పు చేయలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శివసేనను వీడేది లేదని స్పష్టం చేశారు సంజయ్ రౌత్.