Coronavirus Third Wave: జాగ్రత్తలు పాటిస్తే మూడో దశ ముప్పు తక్కువే- వైద్య నిపుణులు
Coronavirus Third Wave: దేశంలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న తరుణంలో థర్డ్ దశ అనివార్యమనే ఆందోళనలు మొదలయ్యాయి.
Coronavirus Third Wave: దేశంలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న తరుణంలో థర్డ్ దశ అనివార్యమనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే తగిన నిబంధనలు పాటిస్తూ ఎక్కువ మంది జనాభాకు టీకాలు వేస్తే భవిష్యత్‌లో వచ్చే కరోనా తీవ్రత తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కొత్త మ్యూటెంట్లు, భవిష్యత్‌లో రాబోయే విలయాలను ఎదుర్కొనేందుకు కరోనా నిబంధనల అమలు, వ్యాక్సినేషన్కీలక అస్త్రాలని చెబుతున్నారు నిపుణులు. ప్రజలు జాగ్రతలన్నీ పాటిస్తూ, టీకా తీసుకుంటే కొవిడ్ మూడో దశ తీవ్రత తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కొవిడ్ మొదటి దశను తేలికగా తీసుకోవడమే ప్రస్తుత విలయానికి దారితీసిందని నిపుణులు అంటున్నారు. వైరస్‌లో మార్పులే ఇందుకు కారణమన్నది మరికొందరి వాదన. ఇలాంటి భిన్నాభిప్రాయాల మధ్య మూడో దశ అనివార్యమని, అందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె విజయ్ రాఘవన్ ఇటీవల అనడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని నిలువరించవచ్చని రెండు రోజుల అనంతరం ఆయనే చెప్పుకొచ్చారు.
మూడో దశ రావొచ్చని ఊహించినప్పటికీ అది ఎప్పుడు వస్తుందో, ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పలేమని డాక్టర్ అనురాగ్ అగర్వాల్ అన్నారు. అయితే రాబోయే రోజుల్లో ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. పెద్ద సంఖ్యలో టీకాల పంపిణీ జరగాలని, అప్పుడే థర్డ్ వేవ్ తీవ్రత తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.