Brijendra Singh Covid19 Positive: మాజీ కేంద్రమంత్రి కుమారుడు, బీజేపీ ఎంపీకి కరోనావైరస్..

Brijendra Singh Covid19 Positive: హర్యానాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా బిజెపి మాజీ కేంద్ర మంత్రి బిరేంద్ర సింగ్ కుమారుడు, ఎంపీ బ్రిజేంద్ర సింగ్ కరోనా భారిన పడ్డారు

Update: 2020-07-05 06:36 GMT

BJP MP Brijendra Singh Covid19 Positive: హర్యానాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా బిజెపి మాజీ కేంద్ర మంత్రి బిరేంద్ర సింగ్ కుమారుడు, ఎంపీ బ్రిజేంద్ర సింగ్ కరోనా భారిన పడ్డారు. హిసార్ నియోజకవర్గం నుంచి బిజెపి ఎంపిగా గెలిచిన బ్రిజేంద్ర సింగ్ గత కొద్దిరోజులుగా కరోనా కట్టడికి నియోజకావర్గంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. దాంతో ముందుగా ఆయనకు జ్వరం తగిలింది. ఈ కారణంగా, శుక్రవారం, ఆయన తన శాంపిల్స్ ను టెస్ట్ కోసం ఇచ్చారు.. దీని నివేదిక శనివారం పాజిటివ్ గా వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ధృవీకరించారు.

బ్రిజేంద్ర సింగ్ శాంపిల్ ఇచ్చిన ఒక రోజు తర్వాత వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. బుధవారం హిసార్‌లో కలిసిన సహోద్యోగులకు తెలియజేయాలనుకుంటున్నాను. దయచేసి సమీప ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్ష చేయించుకోండి. ఏదైనా లక్షణం ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరండి అని పేర్కొన్నారు. అలాగే కరోనాను తేలికగా తీసుకోవద్దని, జాగ్రత్తగా ఉండాలని బ్రిజేంద్ర సింగ్ అభ్యర్థించారు. భౌతిక దూరం పాటిస్తూ, చేతులను నిరంతరం సబ్బు మరియు శానిటైజర్ తో కడుక్కోవాలని, ముఖానికి మాస్కు లేకుండా బయటికి రావొద్దని కోరారు.

కాగా బ్రిజేంద్ర సింగ్ , హర్యానాలో బలమైన నాయకుడుగా పేరొందిన కేంద్ర మాజీ మంత్రి బీరేంద్ర సింగ్ కుమారుడు. రాజకీయ కుటుంబం నుండి వచ్చినా తనకంటూ సొంత గుర్తింపును ఏర్పరచుకున్నారు. 26 సంవత్సరాల వయసులోనే యుపిఎస్‌సి ఉత్తీర్ణత సాధించిన బ్రిజేంద్ర.. 1998 బ్యాచ్ ఐఎఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 2019 లో రాజకీయ రంగప్రవేశం చేయడానికి ఉద్యోగం నుండి వీఆర్ఎస్ తీసుకున్నారు. 2019 హిసార్ లోక్‌సభ స్థానానికి బిజెపి తరుఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పై గెలుపొందారు.


Tags:    

Similar News