ఏ సమీకరణాలు రజినీ-కమల్‌‌ను‌ కలపబోతున్నాయి?

రజినీకాంత్‌, కమల్‌హాసన్. ఇద్దరూ తెర వెనక మంచి స్నేహితులే. కానీ రాజకీయ చిత్రంలో మాత్రం, ఇద్దరూ డిష్యం డిష్యుం స్టార్లే. కానీ ఇదంతా మొన్నటి వరకు. కానీ ఈ ఇద్దరు సూపర్‌ స్టార్లు రాజకీయ తెరపై కలిసి సాగేందుకు సిద్దమయ్యారు.

Update: 2019-11-21 07:34 GMT
Rajinikanth, Kamal Haasan

రజినీకాంత్‌, కమల్‌హాసన్. ఇద్దరూ తెర వెనక మంచి స్నేహితులే. కానీ రాజకీయ చిత్రంలో మాత్రం, ఇద్దరూ డిష్యం డిష్యుం స్టార్లే. కానీ ఇదంతా మొన్నటి వరకు. కానీ ఈ ఇద్దరు సూపర్‌ స్టార్లు రాజకీయ తెరపై కలిసి సాగేందుకు సిద్దమయ్యారు. 2021 నాటికి అరవ పొలిటికల్‌ ఎలక్షన్‌ థ్రిల్లర్‌కు స్క్రిప్టు రెడీ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు రజినీకాంత్‌ను, తమిళుడే కాదంటూ రచ్చ చేసిన కమల్‌హాసన్, ఇప్పుడెందుకు కలిసిసాగాలని డిసైడవుతున్నారు నా దారి రహదారి, బెటర్‌ డోంట్‌ కమ్‌ మై వే అంటూ, కమల్‌పై ఇన్‌డైరెక్టుగా రగిలిపోయిన రజినీ, సడన్‌గా స్క్రీన్‌ ప్లే మార్చడానికి రెడీ అయ్యారు ఎందుకు ఏ సమీకరణలు రెండు దిక్కులను కలపబోతున్నాయి పొలిటికల్ వ్యాక్యూమ్‌ దండిగా వున్న తమిళ రాజకీయ గడ్డపై, ఈ సూపర్‌స్టార్ల కాంబినేషన్‌ హిట్టవుతుందా?

రజినీకాంత్, కమల్‌హాసన్‌లు చేతులు కలపబోతున్నారా?

2021 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సూపర్‌స్టార్లు జతకట్టబోతున్నారా?

ఎవరిదారి వారిదేనన్న స్టార్లు ఒకేదారిలో నడవబోతున్నారా?

ఏ సమీకరణాలు ఇద్దర్నీ కలపబోతున్నాయి?

ఇద్దరి బలంతోనే డీఎంకేను ఎదుర్కోగలమని గ్రహించారా?

రజినీ, కమల్‌ల జాయింట్‌ స్క్రీన్‌ ప్లే పొలిటికల్ తెరపై హిట్టవుతుందా?

తమిళ ఓటు బాక్స్‌ను బద్దలు కొడుతుందా?

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్....మరో సూపర్ స్టార్ కమల్‌ హాసన్...

ఎవరి దారి వారిదే...ఎవరి శైలి వారిదే...ఎవరికి వారే భిన్నం...

రాజకీయంలోనూ ఎవరి రూటువారిదే అన్నట్టుగా సాగుతోంది. కమల్‌ హాసన్ పార్టీని ప్రకటించి, పార్లమెంట్ ఎన్నికల్లోనూ రంగంలోకి దిగితే, రేపోమాపో అంటూ పొలిటికల్‌ స్క్రీన్‌ ప్లే సిద్దం చేసుకుంటున్నాడు రజినీకాంత్.

ముందే చెప్పినట్టు రజినీ, కమల్‌ల రూట్లు వేర్వేరు. సినిమాలపరంగా మంచి స్నేహితులే. ఇద్దరూ బాలచందర్ శిష్యులే. కానీ సిద్దాంతాలపరంగా భిన్నం. దేవుడున్నాడని రజినీకాంత్ ఆధ్మాత్మిక చింతన పాటిస్తే, దేవుడులేడని బల్లగుద్ది చెబుతాడు కమల్. అంటే రజినీ ఆస్తికుడు, కమల్ నాస్తికుడు. ఇద్దరి మధ్యా ఏవో కొన్ని విభేదాలున్నాయని సన్నిహితులు చెప్పేవారు. కానీ జయలలిత మరణం తర్వాత, ఏర్పడిన రాజకీయ శూన్యత భర్తీపై, ఇద్దరూ గురిపెట్టడంతో, ఇద్దరి మధ్యా పొలిటికల్‌ డిఫరెన్సెస్‌ మొదలయ్యాయని రాజకీయ పండితులు చెబుతారు.

రజినీ పార్టీ పెడతారని అనుకుంటున్న టైంలో, కమల్‌హాసన్‌ ఘాటుగానే విమర్శలు చేశారు. రజినీ లోకల్ కాదంటూ సెంటిమెంట్ రాజేశారు. రజినీ పార్టీ పెడతాడని అనౌన్స్‌ చేయకముందు, అసలు రాజకీయాల జోలికివెళ్లని కమల్‌హాసన్, హడావుడిగా మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించేశాడు. అలా ఇద్దరి మధ్యా, రాజకీయ ఆవిర్భావంలోనే, విభేదాలు రచ్చకెక్కాయి. అయితే, ఇప్పుడు ఈ ఇద్దరు సూపర్‌ స్టార్లు కలిసి పని చెయ్యాలని డిసైడయ్యారట. అదే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.

తమిళ ప్రజల కోసం అవసరమైతే కలిసి పనిచేయడానికి సిద్దమంటూ సూపర్ స్టార్ రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ తమ మనసులోని మాటను బయటపెట్టారు. తమిళ ప్రజల సంక్షేమం కోసం తామిద్దరం కలిసి పనిచేస్తామని విధానపరమైన నిర్ణయాలపై తర్వాత చర్చిస్తామని చెన్నై ఎయిర్‌పోర్టులో కమల్ హాసన్ చెప్పారు.

కమల్ వ్యాఖ్యల తర్వాత మీడియా ప్రతినిధులు రజనీకాంత్‌కు ఇదే ప్రశ్నను సంధించారు. కమల్‌తో కలిసి పనిచేయబోతున్నారా? అని ప్రశ్నించగా తమిళ ప్రజల కోసం కమల్ హాసన్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్దమని చెప్పారు.

దాదాపు ఇద్దరూ ఒకే రకమైన కామెంట్లు చేశారు. విభేదాలు పక్కనపెట్టి కలిసి నడవడానికి సిద్దమన్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. మరి మొన్నటి వరకు ఎవరిదారి వారిదే అన్నట్టుగా సాగిన ఈ సూపర్‌స్టార్ల బాట, ఇప్పుడెందుకు ఒకే పాటగా, ఒకే మాటగా సాగాలనుకుంటున్నారు...? ఏ సమీకరణాలు, ఏ పరిస్థితులు వీరిద్దర్నీ ఒకే తెరపై కనపడేలా చేస్తున్నాయి?

విడివిడిగా సాగుతారనుకున్న సూపర్‌స్టార్లు కలివిడిగా నడవాలని ఎందుకు ఆలోచిస్తున్నారు..? ఎలాంటి ఈక్వేషన్స్‌ ఒకే బాటగా నడవాలన్న నిర్ణయానికి కారణమయ్యాయి? పొలిటికల్ తెరపై ఈ అగ్ర నటులు కలిసి సాగితే, అరవ రాజకీయం బ్లాక్‌ బస్టరేనా...?

పురచ్చితలైవి జయలలిత మరణం తర్వాత, తమిళ రాజకీయ గడ్డపై ఒక శూన్యత ఏర్పడిన మాట వాస్తవం. ఎంజీఆర్‌ మరణం తర్వాత ఆ గ్యాప్‌ను జయలలిత భర్తీ చేస్తే, ఇఫ్పుడు జయలలితలేని లోటును ఎవరు పూడుస్తారన్న చర్చ సాగుతోంది. ఆ స్థాయి వున్న నాయకుడు, లేదంటే తెరపైనా, తెరవెనకా అంతటి ప్రజాదరణ వున్న నటుడు ఎవరున్నారన్న చర్చ ఉదయిస్తే, అందులో రజినీకాంత్‌ ముందు వరసలో నిలిస్తే, తర్వాత కమల్‌హాసన్‌ సైతం నేనున్నాని ముందుకు వస్తారు. వీరిద్దరూ కాకుండా, ప్రస్తుతానికైతే మరొకరు అంత బలమైన పాపులర్‌ సూపర్‌స్టార్లు కనిపించడం లేదు తమిళ గడ్డపై.

కమల్ హాసన్ కంటే ముందు నుంచి, రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్న రజనీకాంత్ ఇంతరవకు పార్టీ ప్రకటన చేయలేదు. మూడు,నాలుగేళ్లుగా రేపు మాపు అంటూ ఆయన పార్టీపై డిస్కషన్ సాగుతూనే వుంది. అభిమానులు, కార్యకర్తలతో ఫోటో సెషన్‌ కంటిన్యూ అవుతూనే వుంది. అదే సమయంలో ఆయన కాషాయానికి దగ్గరవుతున్నారన్న కథనాలు కూడా బలంగానే వినిపించాయి. అయితే తమిళగడ్డపై కాషాయం కషాయమే అనుకున్నారేమో కానీ, కాషాయానికి తాను చిక్కను అని ఇటీవలే ఆ ప్రచారాల్ని ఖండించారు.

మొన్నటి వరకు, నా దారి రహదారి అన్నట్టుగా సాగిన రజినీకాంత్, నా రూటే సెపరేటు అంటూ దశావతారాలు చూపించిన కమల్‌లు, కలిసినడవాలని అనుకోవడం వెనక చాలా సమీకరణాలు వున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

ఈ ఇద్దరు సూపర్‌స్టార్ల గురి అన్నాడీఎంకే. దీన్ని రీప్లేస్ చేయడంపైనే పొలిటికల్ హోప్స్‌ డిపెండ్‌ అయ్యాయి. జయ లేరు కాబట్టి, అంతటి పాపులర్‌ వున్న లీడర్‌ కూడా అన్నాడీఎంకేలో లేరు. పదవీకాలముంది కాబట్టి, ఎలాగొలా ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు. అటు ప్రతిపక్షమైన డీఎంకే చాలా బలంగా వుంది. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో సొంతంగానే 23 సీట్లు, కాంగ్రెస్‌తో 31 సీట్లు గెలిచింది డీఎంకే. 2021లోనూ ఇదే పార్లమెంట్‌ ఫలితం రిపీట్ అయితే, అధికారం డీఎంకేదే.

స్టాలిన్‌ నేతృత్వంలో అత్యంత బలంగా వున్న డీఎంకేను ఎదుర్కోవాలంటే, రజినీకాంత్, కమల్‌హాసన్‌లు విడివిడిగా పోటీ చేస్తే కష్టమేనన్నది పొలిటికల్ పండితుల అంచనా. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి, ఒక్క సీటూ గెలవలేకపోయిన కమల్‌హాసన్‌‌కు అనుభవపూర్వకంగా తెలిసిన వాస్తవమిది. కమల్‌ విఫలమవ్వడాన్ని బయటి నుంచి చూసిన రజినీ, అటు తెలుగు గడ్డపై చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌‌‌ల విఫలప్రయోగాన్ని దూరం నుంచి వీక్షించారు. అందుకే ఎంతటి స్టార్లమైనా గ్రౌండ్‌లెవల్‌లో జనాల సమీకరణకు మాత్రమే పనికొస్తుందని, ఓట్లకు కాదని, రజినీ, కమల్‌లు తొందరగానే గ్రహించినట్టున్నారు. అందుకే డీఎంకే, అన్నాడీఎంకేలను జాయింట్‌గా ఎదుర్కోవాలని డిసైడయ్యారని, తమిళ రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. చూడాలి, ఈ సూపర్‌ స్టార్ల మల్టీస్టారర్ కాంబినేషన్, అరవ పొలిటికల్ తెరపై ఎలాంటి సంచనాలు నమోదు చేస్తుందో డీఎంకే ముందు తస్సుమంటుందో. 


Tags:    

Similar News