జబర్దస్త్-అదిరింది పొలిటికల్ డ్రామా స్కెచ్ ఎవరిది?
జబర్దస్త్, అదిరింది. ఇప్పుడు రెండు కామెడీ షోలూ నువ్వానేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి.
జబర్దస్త్, అదిరింది. ఇప్పుడు రెండు కామెడీ షోలూ నువ్వానేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. రేటింగ్ ఫైటింగ్‌లో కత్తులు దూస్తున్నాయి. అయితే, ఈ రెండు ప్రోగ్రామ్‌లపై ఇప్పుడు రాజకీయ రచ్చ జరుగుతోంది. రోజా, నాగబాబులు చెరో కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరిస్తుండటంతో, పొలిటికల్ పంచ్‌లు పేలుతున్నాయి. రెండు ప్రోగ్రాముల మధ్య రచ్చ, వైసీపీ-జనసేన యుద్ధంగా ఎందుకు మారుతోంది? నాగబాబు జనసేన, రోజా వైసీపీ లీడర్లుగా ఉండటమే అందుక్కారణమా? కార్యకర్తలు రెచ్చిపోతున్నా, లీడర్లు తమాషా చూస్తున్నారెందుకు? జబర్దస్త్-అదిరింది పొలిటికల్ డ్రామా స్కెచ్ ఎవరిది?
జబర్దస్త్...ఖతర్నాక్ కామెడీ షో - అదిరింది....మాటల్లేవ్...మాట్లాడుకోవడాల్లేవ్ - ఒక షోకు రాణి స్మైలీ రోజా - మరో షోకు ఆరడుగుల బుల్లెట్ నాగబాబు. ఈ రెండూ బుల్లితెరపై నవ్వుల బాంబులు పేల్చే కామెడీ ఆటంబాబులే. ఈ ఇద్దరూ జడ్జీలు హాస్యానికి మరింత నవ్వులు జతచేసే నటులే. ఈ షో వరకు వీరిద్దరిదీ యాక్టర్స్ నేపథ్యమే. షో నుంచి బయటకు వస్తే, వీళ్లిద్దరూ పక్కా రాజకీయ నాయకులు.
ఒకరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ లీడరైతే, మరొకరు జనసేన అధినేతకు అన్నయ్య, పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకుడు. ఒకప్పుడు ఇద్దరూ జబర్దస్త్‌లో జడ్జీలుగా వ్యవహరించినవారే. కానీ ఇప్పుడు పార్టీలు మారినట్టుగా, ఇద్దరి ప్రోగ్రాములు, ఛానెల్స్ మారిపోయాయి. జబర్దస్త్ నుంచి బయటికొచ్చి అదిరింది షోలో, అదరగొట్టేస్తున్నారు నాగబాబు. జబర్తస్త్‌లోనే వుంటూ, ప్రోగ్రామ్‌కు జబర్దస్త్ రాణిగా వెలుగొందుతున్నారు రోజా.
అయితే ఒకే ప్రోగ్రామ్‌లో వున్నంత వరకు, రోజా, నాగబాబు మధ్య ఎలాంటి వివాదాలూ రాలేదు. ఎప్పుడైతే చెరో చానెల్‌గా మారిపోయారో, అప్పటి నుంచి నాగబాబు వర్సెస్ రోజా యుద్ధం మొదలైందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే రేటింగ్‌ల కోసం ఈ రెండు ప్రోగ్రామ్‌ల మధ్య ఒకచిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. ఈ వార్ కాస్త ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది.
ఇద్దరూ ఒకే ప్రోగ్రామ్‌లో కలిసి చేస్తున్నప్పుడు, ఇద్దరికీ పార్టీ ముద్రలు వేయని అభిమానులు, కార్యకర్తలు, ఎప్పుడైతే చెరో వైపు జరిగారో, అప్పటి నుంచి రాజకీయ ముద్ర వేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు రోజా జడ్జీగా వున్న జబర్దస్త్‌ను వైసీపీగా కొందరు అభిమానులు, కార్యకర్తలు అభివర్ణిస్తుంటే, నాగబాబు అదిరింది ప్రోగ్రామ్‌ను జనసేనగా కోట్ చేస్తున్నారు కొందరు కార్యకర్తలు. దీంతో సోషల్ మీడియాలో జబర్దస్త్ వర్సెస్ అదిరింది కాస్త, వైసీపీ వర్సెస్ జనసేనగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ-జనసేన మధ్య ఎలాంటి మాటల యుద్ధం సాగుతోందో చూస్తునే వున్నాం. ఇప్పుడు ఇది కాస్త టీవీ ప్రోగ్రామ్‌లకు పాకినట్టుంది. జబర్దస్త్, అదిరింది షోలు చూసే ప్రేక్షకులు ఇప్పుడు, రెండు వర్గాలుగా విడిపోయారన్న వాదన వినిపిస్తోంది. కారణం ఎమ్మెల్యే రోజా వైసీపీ నేత కావడంతో వైసీపీ అభిమానులంతా జబర్దస్త్ కామెడీ షోని ఆహాఓహో అంటూ హోరెత్తిస్తున్నారు. అటు నాగబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్రదర్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులంతా అదిరింది షో అదుర్స్ అంటున్నారు. ఇలా ఇద్దరు రాజకీయ నాయకులు, రెండు షోల్లో కీలకంగా వుండటంతో, పొలిటికల్ దుమారం రేగుతోంది.
రెండు ప్రోగ్రాములనూ చూసి నవ్వుకుంటున్న పార్టీల కార్యకర్తలు, అభిమానులు, చూసిన తర్వాత, సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు. వైసీపీ అభిమానులు జబర్దస్త్‌ను మెచ్చుకుంటూ, అదిరింది షోను ట్రోల్ చేస్తుంటే, అటు అదిరిందిని పొగుడుతూ జబర్దస్త్‌ను ఆకాశానికెత్తుతున్నారు జనసేన కార్యకర్తలు. నెంబర్ వన్ షో ఇదేనంటే, ఇదేనంటూ ట్వీట్ల వార్ చేస్తున్నారు. మొత్తానికి కామెడీ ప్రోగ్రామ్‌లను చూసి హాయిగా నవ్వుకోవాల్సినవాళ్లు, ఇలా పార్టీ కార్యకర్తలుగా మారిపోయి, తిట్టుకోవడం ఏమాత్రం బాలేదంటున్నారు ఇతర నెటిజన్లు. రెండు ప్రోగ్రామ్‌ల మధ్య ఇప్పటికే కాంపిటీషన్ పీక్స్‌కు చేరింది. ఇదికాస్త పొలిటికల్ వార్‌గా మారింది.
అయితే, రెండు ప్రోగ్రామ్‌ల మధ్య పొలిటికల్ రచ్చ కావాలనే చేస్తున్నారన్న చర్చ లేకపోలేదు. షోల హైప్ కోసం కొందరు కావాలనే ఇలాంటి వార్ క్రియేట్ చేస్తున్నారన్న వ్యాఖ్యానాలు వినపడుతుంటే, అటు వైసీపీ, జనసేనలు సైతం, సోషల్ మీడియాలో ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయన్న డిస్కషన్ జరుగుతోంది. మొత్తానికి నవ్వుల యుద్ధంతో పాటు పొలిటికల్ వార్‌కూ కేంద్రమవుతున్నాయి జబర్దస్త్, అదిరింది ప్రోగ్రామ్‌లు. చూడాలి, మున్ముందు ఈ వార్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో.