తమన్నా, రానా వంటి చాలా మంది స్టార్ లకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక్కో సినిమాకి చాలా ఎక్కువ గ్యాప్ తీసుకుంటాడన్న విషయం అందరికి తెలిసిందే. ఈ మధ్యనే 'ఫిదా' అనే సినిమాతో మరొక సూపర్ హిట్ ను అందుకున్న శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమా ఎప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది శేఖర్ కమ్ముల కొందరు కొత్త నటీనటులతో సినిమా చేయబోతున్నాడని వార్తలు బయటకు వచ్చాయి కానీ ఆ సినిమా గురించిన అప్డేట్స్ అంతగా బయటకు రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం చిత్రబృందం దుబాయ్ వెళ్లనుంది అని తెలుస్తోంది.
జూన్ మొదటివారంలో నుంచి ఈ చిత్రం షూటింగ్ దుబాయ్ లో జరగనుందట. ఎప్పటిలాగానే ఈ సినిమాలో నటించబోయే నటీనటులకు కూడా ముందుగానే ప్రిపరేషన్ ఇచ్చారట. ఏషియన్ సినిమాస్ పతాకంపై సునిల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో ఒక డిస్ట్రిబ్యూటర్ కొడుకు అని పుకార్లు బయటకు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. అమృత అయ్యార్ అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మిగతా నటీనటులు కూడా కొత్త వారే అని టాక్. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.