Samantha To Konda Surekha: సమంత విడాకుల వెనుక కేటీఆర్.. కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరోయిన్

Update: 2024-10-02 15:46 GMT

Samantha's Counter To Konda Surekha: సమంత, నాగ చైతన్య విడాకుల వెనుక కేటీఆర్ ఉన్నారంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగు, తమిళం నుండి హిందీ వరకు అన్ని భాషల్లోనూ హీరోయిన్ సమంతకు ఐడెంటిటీ ఉండటంతో కొండా సురేఖ వ్యాఖ్యలు అన్ని భాషల్లోనూ అంతే పాపులర్ అయ్యాయి. మరోవైపు, సినీ పరిశ్రమ నుండి ప్రకాష్ రాజ్, నాగార్జున కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్స్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సినిమా వాళ్ల పేర్లు వాడుకునే దిగజారుడు రాజకీయాలు చేయొద్దంటూ హితవు పలికారు. దీంతో మీడియాలో ఒక్కసారిగా సమంత పేరు హైలైట్ అయింది. ఒక అన్‌పాపులర్ యాంగిల్లో తన పేరు హైలైట్ అవడంతో చివరకు ఈ అంశంపై సమంత కూడా స్పందించారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. ఒక మహిళగా బయటికొచ్చి, ఎన్నో సవాళ్ల మధ్య సినీ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడటం, అలాగే అందులోంచి మళ్లీ బయటపడటం, జీవితంలో సవాళ్లను అధిగమిస్తూ వస్తోన్న తన గురించి ఇలా తప్పుడు మాటలు అనొద్దని మంత్రి కొండా సురేఖకు సమంత విజ్ఞప్తి చేశారు. ఒక మంత్రి హోదాలో మీరు చేసిన వ్యాఖ్యలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. అందుకే ఎదుటి వారి జీవితాన్ని, వారి ప్రైవసీని గౌరవించాల్సిందిగా కోరుకుంటున్నాను అంటూ సమంత ఒక నోట్ విడుదల చేశారు.

తన విడాకుల వ్యవహారం అనేది తన సొంత విషయం. దానిగురించి ఊహాగానాలు వ్యాపింపచేయొద్దని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. "ఒక విషయాన్ని ప్రైవేటు అని అంటున్నాం అంటే దాని అర్థం ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చెప్పుకొమ్మని కాదు" అని సమంత తన నోట్‌లో పేర్కొన్నారు. 


తన విడాకులు అనేది తామిద్దరం (తాను, నాగచైతన్య) కలిసి తీసుకున్న నిర్ణయం. ఇందులో రాజకీయ కోణాలు, రాజకీయ కుట్రలు ఏవీ లేవు అని సమంత స్పష్టంచేశారు. తానెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాను. అలాగే ఉండాలి అనేది తన కోరిక. దయచేసి తన పేరును రాజకీయ దుమారంలోకి లాగవద్దంటూ మంత్రి కొండా సురేఖను విజ్ఞప్తిచేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు సమంత ఇచ్చిన కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News