జై లవకుశ సినిమా తరువాత ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది నివేద థామస్. మళ్లీ ఇన్నాళ్లకు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన '118' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ గ్యాప్ లో ఏం చేసింది? అనేది '118' ప్రమోషన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'జై లవకుశ' సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బాచిలర్ ఎడ్యుకేషన్ను పూర్తి చేయడంపై దృష్టి పెట్టిందట. ఒక థీసిస్ పనిమీద ఆరు నెలల పాటు వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది నివేద.
మరోవైపు '118' చిత్ర దర్శకుడు కె.వి.గుహన్ మాట్లాడుతూ నివేద థామస్ దర్శకులను వేధిస్తుందని చెప్తున్నాడు. వేధించడం అంటే అదంతా ఔట్ పుట్ విషయంలోనట. "తాను చేయబోయే సన్నివేశం ఎలా ఉంటుందో ముందే తెలియాలని పట్టు పడుతుంది తన ప్రతి డైలాగ్ ను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే చెప్తుంది." అని చెప్పిన గుహన్ స్క్రిప్టులో డైలాగులు ప్రతిదీ కంఠతా పట్టేస్తుందని కూడా అన్నారు. పని విషయంలో చాలా డెడికేటెడ్గా ఉండే కథానాయికను చూడలేదని '118' లో తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందని వెల్లడించారు.