International Film Festival Of India: ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్‌గా చిరంజీవి

* గోవాలో 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రకటన.. 79 దేశాలకు చెందిన 280 చిత్రాల ప్రదర్శన

Update: 2022-11-21 01:28 GMT

ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్‌గా చిరంజీవి 

International Film festival Of India: 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇండియన్ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌- 2022 గా చిరంజీవి ఎంపికయ్యారు. చిరంజీ నాలుగు దశాబ్దాలుగా నటుడిగా, డ్యాన్సర్‌గా, నిర్మాతగా 150కిపైగా సినిమాలు చేసి అద్బుతమైన నటనతో అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ప్రజాదరణ పొందారు. ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైన చిరంజీవికి కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ అవార్డును 2013లో భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తొలిసారి నెలకొల్పారు. భారతీయ సినీ పరిశ్రమలో చేసిన సేవలకు, ఇండస్ట్రీ అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖులకు ఈ పురస్కారం ప్రకటిస్తారు. చిరంజీవి కంటే ముందు అమితాబ్‌ బచ్చన్‌, రజినీకాంత్‌, హేమ మాలిని, ఇళయ రాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ అవార్డు అందుకున్నారు.

గోవాలో ఆదివారం నుంచి ఈ నెల 28వరకు చలన చిత్రత్సోవాలు కొనసాగనున్నాయి. ఈ ఈవెంట్‌ పనాజీ సమీపంలోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో మొదలైంది. తొమ్మిది రోజులపాటు కొనసాగే ఈ ఈవెంట్‌లో 79 దేశాల నుంచి మొత్తం 280 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఇండియన్ పనోరమ విభాగంలో 25 ఫీచర్ సినిమాలు, 20 నాన్- ఫీచర్ సినిమాలు ప్రదర్శించనున్నారు.

Tags:    

Similar News