చిత్ర పరిశ్రమలో పేరున్నంతగా డబ్బు ఉండదు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!
సినీ పరిశ్రమ పై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్... చిత్ర పరిశ్రమలో చాలా సంపద ఉంటుందని అభిప్రాయం సాధారణ ప్రజానీకంలో ఉంది. విపత్తులు జరిగినప్పుడు సినిమా పరిశ్రమ స్పందిస్తూనే ఉంది. విరాళాలు ఇస్తూనే ఉన్నారు.
సినీ పరిశ్రమ పై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్... చిత్ర పరిశ్రమలో చాలా సంపద ఉంటుందని అభిప్రాయం సాధారణ ప్రజానీకంలో ఉంది. విపత్తులు జరిగినప్పుడు సినిమా పరిశ్రమ స్పందిస్తూనే ఉంది. విరాళాలు ఇస్తూనే ఉన్నారు. కానీ సరిపోయినంత ఇవ్వడం లేదనే విమర్శ కూడా ఉంది. అసలు సరిపోయినంత ఇవ్వడం లేదని నిర్ధారించేది ఎవరు? సరిపోయినంత ఇవ్వడం లేదని నిర్ధారించే వాళ్లు వారి జేబుల నుంచి పది రూపాయలైన తీసి ఇచ్చారా? కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బు నుంచి కోటి రూపాయలు, పది లక్షలు రూపాయలు విరాళాలుగా ఇవ్వాలంటే అలాంటివారికి మనసు ఒప్పుతుందా? అలాంటిది నా వరకు నేను తీసుకుంటే కొన్ని కోట్లు విరాళాలు ఇచ్చానని అన్నారు పవన్..
అలా చేయాలంటే చాలా పెద్ద మనసు కావాలి. చిత్ర పరిశ్రమలో పేరున్నంతగా డబ్బు ఉండదు.. ఆరెంజ్ సినిమాకు నష్టం వస్తే అప్పులు తీర్చడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే పైరసీకి గురై నెట్ లో రిలీజ్ అయితే కొనటానికి ఎవరూ ముందుకు రాలేదు. గ్యారంటీ సంతకాలు చేసి రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇన్ని కష్టనష్టాలు ఉంటాయి. సినిమా రంగంలోనివారికి పేరేమో ఆకాశానికి ఉంటుంది కానీ డబ్బు ఆ స్థాయిలో ఉండదని పవన్ అన్నారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలా ఇక్కడ వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉండదని అన్నారు.
ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులు వందల కోట్లు ఖర్చు చేస్తారు. ఆ స్థాయి డబ్బులు ఇక్కడ ఉండవు. నిజానికి సంపద అంతా- రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర, ఎలక్షన్ సమయంలో వందలకోట్లు ఖర్చు చేసిన రాజకీయ నాయకుల దగ్గర వేల కోట్లు ఖర్చు పెట్టగలిగే రాజకీయ వ్యవస్థల దగ్గర, వేలకోట్లు విలువైన ఎగుమతుల వ్యాపారాలు చేసే పారిశ్రామికవేత్తల దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉండే సంస్థలు, కాంట్రాక్టర్ల దగ్గర ఉంది. వాళ్లతో పోల్చితే సినిమా పరిశ్రమ చాలా చిన్నది. ఒక్క సీజన్ లో అన్ని సినిమాలు ఖరీదు కలిపితే వెయ్యి కోట్లు కూడా ఉండవు. అది కూడా ఒక్కడి ఆస్తి కాదు. ఒక సినిమా నిర్మించాలంటే పదిమంది ప్రతిభావంతులు కలిసి పని చేయాలని అన్నారు.
అన్ని సరిగ్గా కుదిరితే డబ్బులు మిగులుతాయి. ఒక వ్యక్తి సినిమా పరిశ్రమలో కోటి రూపాయలు సంపాదిస్తే అందులో జీఎస్టీ పోతుంది. అలాగే మిగిలిన ట్యాక్సులు అన్నిపోగా రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షల వరకూ చేతికి అందుతుంది. అదే నష్టం వస్తే ఆ డబ్బు కూడా మిగలదు. ఎంతో మంది జీవితాలు కోల్పోయిన వారు ఈ రంగంలో ఉన్నారు.
చిత్ర పరిశ్రమ చాలా సున్నితమైన పరిశ్రమ. సులువుగా టార్గెట్ చేసేస్తారు. ఎన్నికల సమయంలో వందల కోట్లు మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. గెలిచినా, ఓడినా భారీగా ఖర్చుపెడుతున్న వాళ్ళు అధికారం ఉన్నా, లేకున్నా ఇలాంటి పరిస్థితుల్లో ఆ డబ్బులు బయటకు తీయాలి. వారి వారి నియోజకవర్గాల్లో ఎలక్షన్ల పెట్టుబడి అనుకొని రూ. 50 కోట్లయినా ఖర్చు పెట్టి బాధితులకు అండగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశ్యం. కరోనా విపత్కర పరిస్థితుల్లో నేను కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు ఇస్తే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గారు రూ. 25 కోట్లు ఇచ్చారు.. సంతోషం.
నా స్థాయి కోటి రూపాయలు, రెండు కోట్లు అయితే అక్షయ్ కుమార్ స్థాయి రూ. 25 కోట్లు. అందులో మెహర్బానీ ఏమీ లేదు. కొంతమంది విరాళాలు ఇవ్వరు. విరాళం అనేది స్పందించి ఇవ్వాలి తప్ప... మీరు ఎందుకు ఇవ్వలేదని అడగడానికి లేదు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవ్యవస్థే కుదేలయ్యింది. బయట డబ్బు పుట్టడం కష్టంగా మారింది. పని చేద్దాం అంటే పని దొరికే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అదనంగా విరాళాలు అంటే అందరికి ఇబ్బందికర పరిస్థితే.ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయాలి.
తెలంగాణ ప్రభుత్వానికి అన్ని వర్గాల వారు విరాళాలు ఇస్తున్నారు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రో యాక్టివ్. ఆయన అన్ని వర్గాల వారికి విజ్ఞప్తి చేశారు. మంత్రి వర్గంలోని సభ్యులు వారి వారి స్థాయిలో అన్ని వర్గాల వారికి చేరువవుతున్నారు. సంపద సృష్టించినప్పుడు కొంత సంపద ఇవ్వొచ్చు. కానీ సంపదే లేనప్పుడు విరాళాలు అడిగితే కొద్దిగా ఇబ్బందే. అయినా కేసీఆర్ లాంటి ప్రో యాక్టివ్ ముఖ్యమంత్రి అడిగారని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ని వర్గాల వారిని రీచౌట్ అవ్వాలి. రాజకీయాల్లోకి సేవ చేయాలనే భావనతో అందరు వచ్చారు.
ఎలక్షన్ సమయంలో గెలిచినా, ఓడిపోయిన వందల కోట్లు ఖర్చు చేశారు. ఈ విపత్కర సమయంలో రాజకీయ నాయకుల వారి వారి నియోజకవర్గాల్లో ఎలక్షన్ కు పెట్టుబడి అనుకొని పెద్ద మనసుతో వరద బాధితులకు అండగా ఉండాలని కోరుతున్నాను" అని పవన్ కళ్యాణ్ అన్నారు.