Chiranjeevi: క్యాన్సర్ గురించి మెగాస్టార్ కామెంట్స్.. కన్‌ఫ్యూజన్‌పై క్లారిటీ..
మెగా స్టార్ చిరంజీవి అభిమానులకే కాదు తెలుగు ఇండస్ట్రీకే పెద్ద షాక్ తగిలింది. చిరంజీవికి క్యాన్సర్ సోకిందని ఆయనే స్వయంగా ప్రకటించారని సోషల్ మీడియాలో కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయమై చిరంజీవి ఏమన్నారంటే..
Shocking News: సోషల్ మీడియాలో ఒక వార్త మెగా అభిమానులనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీని వణికించేసింది. మెగా స్టార్ చిరంజీవి క్యాన్సర్ బారిన పడ్డారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. హైదరాబాద్ నానక్ రామ్ గూడలో స్టార్ హాస్పటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ తన స్వీయానుభవాన్ని పంచుకున్నారు. అది కాస్త మిస్ ఫైర్ అయ్యి చిరంజీవికి క్యాన్సర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.
క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, ఈ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని చిరు అభిప్రాయపడ్డారు. క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తే పెద్ద జబ్బే కాదని తెలిపారు. తన విషయంలో కూడా అదే జరిగిందని చెప్పారు. క్యాన్సర్ పై అలర్ట్ గా ఉండి తాను కొలోన్ స్కొప్ టెస్ట్ చేయించుకున్నానని ఆ పరీక్షల్లో తనకు నాన్ క్యాన్సరస్ పాలిప్స్ ఉన్నాయని వైద్యులు గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ చేసి తీసేశారని చిరంజీవి తన స్వీయానుభవాన్ని పంచుకున్నారు. అలాగే తాను సోషల్ డ్రింకర్ని మాత్రమేనని, స్మోకింగ్, చూయింగ్ గమ్ నమలడం వంటి బ్యాడ్ హ్యాబిట్స్ తనకు లేవని..కాబట్టి క్యాన్సర్ రాదని భావించకుండా టెస్టులు చేయించుకున్నందుకే వ్యాధి బారినపడలేదని చిరంజీవి చెప్పారు.
ఇక ఇదే విషయాన్ని కొన్ని వెబ్ సైట్స్ చిరంజీవికి క్యాన్సర్ అంటూ హెడ్ లైన్స్ పెట్టి వార్తలు ఇచ్చేశాయి. ఇలా చేయడం వల్ల అనవసరంగా కన్ ఫ్యూజన్ ఏర్పడిందని మెగాస్టార్ అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ క్యాన్సర్ మనకెందుకు వస్తుంది అని అనుకోకుండా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని చిరు సూచించారు. ఇక ఇదే వేదికపై చిరంజీవి తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. పేద కార్మికుల కోసం స్క్రీనింగ్స్, టెస్టులకు సంబంధించి తన వంతు సాయం చేస్తానని చిరు ప్రకటించారు. ఇందుకు ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తానని తెలిపారు. తన అభిమానులు సైతం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. క్యాన్సర్ పై పోరాటంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ముందుంటుందని మెగాస్టార్ ప్రకటించారు.