Ramnagar Bunny: చంద్రహాసన్ ఇరగదీశాడుగా.. ఆకట్టుకుంటోన్న 'రామ్‌నగర్ బన్నీ' టీజర్..
Ramnagar Bunny: ప్రముఖ యాంకర్ ప్రభాకర్ తనయుడు చంద్రహాసన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం రామ్‌నగర్ బన్నీ.
Ramnagar Bunny: ప్రముఖ యాంకర్ ప్రభాకర్ తనయుడు చంద్రహాసన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం రామ్‌నగర్ బన్నీ. తొలి సినిమానే అయినా ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా భారీగా క్రేజ్ సంపాదించుకున్నాడు చంద్రహాసన్. ముఖ్యంగా లాంచింగ్ సమయంలో తనదైన శైలిలో కామెడీ పండిస్తూ.. ఆటిట్యూడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను అక్టోబర్ 4వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచే పనిలో పడింది. ఇందులో భాగంగా తాజాగా చిత్ర యూనిట్ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.
1.35 నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం కామెడీగా ఉంది. సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉండనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా కాలేజీ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. టీజర్ విడుదల సందర్భంగా హీరో చంద్రహాస్ మాట్లాడుతూ.. 'రామ్ నగర్ బన్నీ సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. ఈ సినిమాకు ప్రతి ఒక్కరం టీమ్ వర్క్ చేశాం. హీరోయిన్స్ అద్భుతంగా నటించారు. నలుగురు హీరోయిన్స్ పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. నేను డ్యాన్స్ లు బాగా చేశానని అంటున్నారు. ముందుగా బాగా ప్రాక్టీస్ చేయడమే స్క్రీన్ మీద మంచి ఔట్ పుట్ తీసుకొచ్చింది' అని చెప్పుకొచ్చారు.
తెలుగులో ఉన్న అగ్ర హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ , ఎన్టీఆర్‌లను స్ఫూర్తిగా తీసుకొని నటిస్తానని చంద్రహాసన్ చెప్పుకొచ్చారు. మరి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న ఈ కొత్త హీరో తొలి మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.