2018 Trailer: తెలుగులోకి మల్లువుడ్ 100 కోట్ల సినిమా.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
2018 Trailer: కేరళ వరదలను ఆధారంగా చేసుకొని మలయాళంలో వచ్చిన 2018 మూవీ విడుదలైన 10 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీని తెలుగులో నిర్మాత బన్నీవాసు విడుదల చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
2018 Trailer: 2018.. ఈ ఏడాదిని కేరళ వాసులు అసలు మర్చిపోలేరు. ఎందుకంటే ఈ ఏడాదిలోనే ఆ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ ప్రకృతి విధ్వంసకాండలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 10 లక్షలమందికి పైగా నిరాశ్రయులయ్యారు. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో వరద బీభత్సానికి ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఎన్నో ఇళ్లు పేకమేడలా నీటిలో కొట్టుకుపోయాయి.
కేరళ వరదలను బేస్ చేసుకొని జుడ్ ఆంథనీ జోసెఫ్ 2018 టైటిల్ తో ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో టోవినో థామస్, అపర్ణ బాలమురళీ, తన్వి రామ్ కీలక పాత్రల్లో నటించారు. 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా కేవలం 10 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. మే 5న విడుదలైన ఈ సినిమా అక్కడ విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ మూవీని తెలుగులో విడుదల చేయనున్నారు.
మలయాళంలో హిట్ సాధించిన 2018 మూవీని అదే టైటిల్ పై తెలుగులో ప్రముఖ నిర్మాత బన్నీవాసు విడుదల చేయనున్నారు. తెలుగులో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో సైతం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను లాంఛ్ చేశారు. కేరళలోని ఒక మారుమూల పల్లెటూరు నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. దొంగ మెడికల్ సర్టిఫికేట్ తో ఆర్మీలో చేరి..అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయి వచ్చిన యువకుడి పాత్రలో టోవినో థామస్ కనిపిస్తారు. వరదల సమయంలో తమని తాము రక్షించుకుంటూనే ఎదుటివారికి ఎలా సాయం చేశారనే దానిపై కథ నడుస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అందర్ని ఆకట్టుకుంటోంది.