10 Years to Rajamouli Maryadaramanna: రాజమౌళి 'మర్యాద రామన్న'కి పదేళ్ళు!
10 Years to Rajamouli Maryadaramanna: టాలీవుడ్ లో మగధీర ఓ సినిమా సంచలనం అని చెప్పాలి. అప్పటివరకూ ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.
Rajamouli 'Maryada Ramanna' Completes 10 Years of Released: ఒక సూపర్ డూపర్ హిట్ భారీ సినిమా తీసిన దర్శకుడు వెంటనే సినిమా తీయాలంటే ఎటువంటి సినిమా తీస్తారు. దానిని మించిన సినిమా అని అందరూ అంటారు. ఫ్యాన్స్ కూడా ఆ దర్శకుడు ఇంకా భారీ సినిమా తీస్తారని ఆశిస్తారు. కానీ, ఈతరం దిగ్దర్శకుడు రాజమౌళి స్టైల్ వేరు. ఒక భారీ సినిమా తీసిన వెంటనే ఎవరి అంచనాలకూ అందని విధంగా చిన్న బడ్జెట్లో చిన్న స్టార్లతో సినిమా తీశారు. అవును..మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తీసిన తరువాత రాజమౌళితో అవకాశం కోసం ఎందరో పెద్ద హీరోలు ఎదురుచూశారు. అభిమానులు కూడా రాజమౌళి తరువాతి సినిమాలో మన హీరోనే ఉంటాడు అన్నట్టుగా భావించారు. అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ రాజమౌళి మళ్ళీ సూపర్ హిట్ ఇచ్చారు. అయితే, అందులో హీరో మాత్రం అప్పటివరకూ తెలుగు తెరపై తన నటనతో నవ్వులు పూయిస్తున్న సునీల్. సునీల్ హీరోగా అనేదే ఒక పెద్ద వార్తా అయితే, రాజమౌళి దర్శకుడు అంటే ఇక అది ఎంత సంచలనమో కదా. అవును ఆ సంచలనాన్ని మరింత సంచలన విజయంగా మలచి ఈ తరంలో తనను మించిన దర్శకుడు లేదని నిరూపించుకున్నారు రాజమౌళి. ఆ సినిమా పేరు 'మర్యాదరామన్న'. సరిగ్గా పదేళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా తన మర్యాదైన కథనంతో అందరి మన్ననలూ పొందింది. ఈ సినిమా దశాబ్ది సందర్భంగా సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలు మీకోసం!
మగధీర భారీ హిట్ అందుకోవడంతో తదుపరి చిత్రం పైన అంచనాలను తగ్గించుకోవడానికి రాజమౌళి చిన్న హీరోతో సినిమా చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే సునీల్ తో ఈ సినిమాని అనౌన్స్ చేశారు రాజమౌళి.. 1923లో విడుదలైన ఆంగ్ల మూకీ చిత్రం 'అవర్ హాస్పిటాల్టీ' చిత్రకథ నుంచి ప్రేరణ పొందిన రాజమౌళి దానిని 'మర్యాద రామన్న'గా తనదైన శైలిలో తెరకెక్కించారు. అయితే సునీల్ కంటే ముందుగా ఇద్దరు హీరోలను అనుకున్నారు రాజమౌళి . కానీ ఆ తర్వాత ఈ కథ సునీల్ దగ్గరికి వెళ్ళింది. హీరోగా సునీల్ కి ఇది రెండో సినిమా కావడం విశేషం.. ఇక హీరోయిన్ గా సలోనిని ఎంచుకోవడానికి పెద్ద కథే ఉంది. మగధీర సినిమాలోని శ్రీహరి ప్రియురాలు పాత్రను పోషించిన సలోనినే హీరోయిన్ గా తీసుకున్నాడు రాజమౌళి.
సినిమా మొత్తం భాగాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే తెరకెక్కించారు. రాజమౌళి తెరకెక్కించిన అన్ని సినిమాలలో అతి తక్కువ టైంలో మేకింగ్ అయిపోయిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.. ఈ సినిమాకి మొత్తం నాలుగు నంది అవార్డులు వచ్చాయి. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ₹ 10.58 కోట్లను వసూలు చేసింది. అంతేకాకుండా 2010 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన టాప్ టెన్ మూవీస్ లో మర్యాద రామన్న ఒకటి.. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే మంచి కాలక్షేపం అని చెప్పవచ్చు.