అతివేగం, నిర్లక్ష్యం, నిబంధనలు పాటించక పోవడం కారణం ఏదైనా.. రోడ్డు ప్రమాదాలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. అభాగ్యులు బలౌతూనే ఉన్నారు. రోడ్లు నెత్తురోడుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాల్లోని ఈ ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి వాహనదారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదాలకు కారణమయ్యాయి.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తనకల్లు, నల్లచెర్వు మండలాల సమీపంలోని 42వ నెంబరు జాతీయ రహదారిపై మినీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కుక్కంటి క్రాస్ నుంచి ప్రయాణికులతో కదిరికి వెళ్తున్న మినీ బస్సు తనకల్లు మండలం పరాకువాండ్లపల్లి క్రాస్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇక కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని హాలహర్వి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఎమ్మిగనూరుకు చెందిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు ఎమ్మిగనూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఎమ్మిగనూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అల్మాయిపేట గ్రామ శివారులో బస్సు-కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సాధారణ రహదారి నుంచి కారు జాతీయ రహదారిపైకి ప్రవేశించే క్రమంలో ఇరువైపులా గమనించకుండా ముందుకు పోవడంతో నారాయణఖేడ్ నుంచి సంగుపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సును కారును ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దత్తు, కిరణ్ మృతి చెందారు. ఈ మూడు ఘటనల్లోనూ వాహనదారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదాలకు కారణమని పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.