పార్టీని చూసి ఓటు వేయకుండా.. నిజాయితీగా మీకు అందుబాటులో ఉండే వారికి ఓటేయండి అని సూచిస్తున్నారు శ్యామ్ శరన్ నేగి. ఈయన భారత దేశపు తొలి ఓటరు. ఇపుడు ఈయన వయసు 102 సంవత్సరాలు. 1951లో భారత్ లో ప్రథమంగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొదటి ఓటు వేసింది నేగీనే. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన నేగీ ఈరోజు మరోసారి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
నేగి ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆయన తన మొదటి ఓటును ఎలా వేశారో మీడియాకు వివరించారు. ''దేశంలో మొట్టమొదటి ఎన్నికలు 1952 ఫిబ్రవరిలో జరిగాయి. అయితే హిమాచల్ ప్రదేశ్ లోని గిరిజన ప్రాంతాల్లో చలి కాలం లో ఎన్నికల నిర్వహణ కష్టంగా ఉంటుందని ముందుగానే అంటే అక్టోబర్ 23, 1951 నే అక్కడ ఎన్నికలు నిర్వహించారు. నేను ఉపాధ్యాయుడను కావడంతో ఎన్నిక డ్యూటీకి వెళ్ళాను. నాకు ఎక్కడన్నా ఓటు వేసే సౌలభ్యం కల్పించారు. దాంతో నేను విధులు నిర్వహించాల్సిన పోలింగ్ కేంద్రం వద్దనే నా ఓటును సరిగ్గా ఉదయం 7 గంటలకు వినియోగించుకున్నాను. ఆ విధంగా భారత దేశం లో ఓటు వేసిన తోలి వ్యక్తిని నేనే అయ్యాను'' అని అయన ఆ రోజును గురించి వివరించారు. అంతే కాదు, నా జీవితంలో ఒక్క ఎన్నికలోనూ ఓటు వేయడం మానలేదు. అవి పంచాయతీ ఎన్నికలైనా.. సార్వత్రిక ఎన్నికలైనా అని చెప్పారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగోలేదు. మోకాళ్ళ నెప్పులతో నడవలేని పరిస్థితిలో ఉన్నారు. కంటి చూపు, వినికిడి తగ్గిపోయాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేయగలనో లేదో అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆయనను పోలింగ్ కేంద్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, సగౌరవంగా తీసుకువచ్చే బాధ్యత తమదని చెప్పారు. ఇపుడు నేగి ఓటు వేస్తె అది ప్రత్యేకమే అవుతుంది.